మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుంది బ్రహ్మోత్సవం పరిస్థితి. అసలే సినిమా ఫ్లాపు. దానికి తోడు నెగిటీవ్ టాక్ విపరీతంగా వ్యాపిస్తోంది. సినిమాకి వెళ్తాం అనిప్రిపేరయిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా.. ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నారు. ఆ ప్రభావం బ్రహ్మోత్సవం వసూళ్లపై విపరీతంగా పడే అవకాశాలుకనిపిస్తున్నాయి. స్టార్ హీరో, అందులోనూ మహేష్‌లాంటి స్టామినా ఉన్న హీరో సినిమా ఎంత ఫ్లాప్ అయినా రూ.30 నుంచి 40 కోట్లు రావడం ఖాయం. ఇప్పుడు బ్రహ్మోత్సవం దానికీ దూరమయ్యే ప్రమాదంలో పడింది. ఇంతకీ ఈ సినిమాని ఇంతగా చంపేస్తోంది ఎవరు?? ఎందుకిలా జరిగింది??
శుక్రవారం ఫస్ట్ షో అయ్యిందో లేదో… పూర్తి టాక్ బయటకు వచ్చేసింది. ఫేస్ బుక్‌లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా బ్రహ్మోత్సవం బాధితులే కనిపించారు. ఓ సినిమాపై ఇంత ఎటకారపు జోకులు… సెటైర్లు ఈమధ్య కనిపించలేదు. అదీ విడుదలైన తొలి ఆట ముగిసే సమయానికే. ఓవర్సీస్లో ప్రీమియర్ షో పడగానే బ్రహ్మోత్సవం భవిష్యత్తు బయటపడిపోయింది. మరీ ముఖ్యంగా నాన్ మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఈ సినిమాకి వెళ్లడం అంటే నీరసాన్ని కొనుక్కోవడమే, టీవీ సీరియల్‌ని వెండి తెరపై చూడడమే అన్న రేంజులో భయపెట్టేశారు.
నెటిటీవ్ టాక్‌తో పండగ చేసుకొన్నవాళ్లలో పవన్ కల్యాణ్ ఫ్యాన్సే ఎక్కువ. సినిమాకెళ్దాం అనుకొన్న వాళ్లు కూడా ఈ టాక్ చూసి భయపడి వెనుకంజ వేస్తున్నారంటే…. నెగిటీవ్ టాక్ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవొచ్చు. పవన్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడానికి కూడా ఓ కారణం ఉంది. సర్దార్ – గబ్బర్‌సింగ్ విడుదలై ఫ్లాప్ అనిపించుకొన్నప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఎక్కువ హడావుడి చేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. సర్దార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న వార్తని వాళ్లే ఎక్కువ మోశారు… విస్తృత ప్రచారం కల్పించారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది అంతే తేడా. అభిమానం పేరుతో అటు పవన్, ఇటు మహేష్ ఫ్యాన్స్ కొట్టుకొంటున్నారు గానీ, అసలు హీరోలు బాగానే ఉన్నారు. సర్దార్తో పవన్ రూ.25 కోట్లు, బ్రహ్మోత్సవంతో మహేష్ 25 కోట్లు అందుకొన్నారు. ఫ్యాన్సే ఇలా టైమ్ వేస్ట్ చేసుకొంటున్నారు. మరో సినిమాని అడ్డంగా చంపేస్తున్నారు.