తెలుగుదేశంతో నిర్మొహమాటంగా, కఠినంగా వుంటేతప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎదగలేమని భావించే వారి సంఖ్య బిజెపి రాష్ట్రశాఖలో పెరుగుతోంది. ప్రత్యేక హోదా” ఒక సెంటిమెంటుగా మారుతున్న సమయంలోరాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్నబుచ్చుతున్నామన్న సంకేతం ”తెలుగు ప్రజల్లోకి వెళ్ళకూడదని బిజెపి కేంద్రనాయకత్వం భావిస్తోంది.
ఈ నేపధ్యంలో క్రమశిక్షణ గల స్వయం సేవకుడు, నిబద్ధత గల రాజకీయ కార్యకర్త, స్వయం కషితో ఎదిగిన నాయకుడు సోము వీర్రాజుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడమంటే తెలుగుదేశం మీద రాజకీయంగా యుద్ధప్రకటన చేయడమేనా అనే విషయంమై పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోవడమే నియామకంలో విపరీతమైన జాప్యానికి కారణం! అయితే మే 25 కల్లా నియామకం పూర్తిచేయాలని ఈమధ్యే సమావేశమైన బిజెపి కోర్ కమిటీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతినకుండా, బిజెపి, తెలుగుదేశం పార్టీల స్నేహ సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం ఇపుడు బిజెపి ముందున్న ప్రయారిటీ. తెరవెనుక లాబీయింగే తప్ప ఎంత అవమానాల పాలైనా నోరు మెదపని చంద్రబాబు ఓర్పే –
– కవ్వించడానికి ఏ అవకాశాన్నీ వొదులుకోని వీర్రాజు దూకుడుకి బ్రేక్ వేసేలా వుంది.
నవ్యాంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో సంఖ్యాపరంగా కాపులకు వున్న ప్రాబల్యం రీత్యా అదే సామాజిక వర్గం వారికే బిజెపి రాష్ట్ర అధ్యక్షపదవి కట్టబెట్టాలన్న నిర్ణయం ఇప్పటికే వుంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి మారిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అదే సామాజిక వర్గం వారు.
తెలుగుదేశం మీద విరుచకుపడే వారుగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. మాణిక్యాలరావు నిర్మహమాటంగా మాట్లాడుతారు. విమర్శ లేదా దాడి విషయం మీదేతప్ప వ్యక్తిమీద కు ఫోకస్ కాకుండా వ్యాఖ్యానాలు చేయగలరు. డాక్టర్ ఆకుల సత్యనారాయణ విషయపరిజ్ఞానం బాగావున్నవారు. ముక్కుసూటిగా మాట్లాడగలవారు.
కన్నా, ఆకుల లతో పోల్చినపుడు వీర్రాజు, మాణిక్యాల రావు పార్టీలో సీనియర్లు. స్వయం సేవకులై వుండటం ఈ ఇద్ధరికీ అదనపు అర్హత. ఇదంతా విశ్లేషించినపుడు బిజిపి అంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి ఈ ఇద్దరి మధ్యే వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.