నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సమయంలో అస్సాంలో బిజెపి అధికారం కైవశం చేసుకోవడమే గాక వామపక్ష ప్రధాన రాష్ట్రాలుగా పేరొందిన కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఖాతా తెరవడం, ఆపార్టీ అసాధారణ విజయంగా కొందరు అభివర్ణిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర,హర్యానా,రాజస్థాన్,అస్సాం రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగినా ఢిల్లీ, బీహార్లలో దారుణంగాి దెబ్బతిన్న బిజెపికి అస్సాంలో విజయం పెద్ద వూరటే. కాని ఈ ఫలితాలను బిజెపికి దేశవ్యాపిత విజయంగా చూపించడం కూడా వాస్తవికం కాబోదు. ఆ పార్టీకి ప్రతిచోటా ఓటింగు తగ్గింది. లోక్‌సభలో 44 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హౌదా కోల్పోయిన కాంగ్రెస్ వేగంగా దెబ్బతింటున్నది. కర్ణాటక మినహా మరే పెద్ద రాష్ట్రంలోనూ పాలించడం లేదు. ప్రధాన పార్టీగా అధికారం చలాయించిన కాంగ్రెస్ స్థానాన్ని మతవాద మితవాద బిజెపి ఆక్రమిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే అప్పుడే బిజెపి దూసుకువస్తున్నట్టు కాంగ్రెస్ శాశ్వతంగా దెబ్బతినిపోయినట్టు చిత్రించడం తొందరపాటే. ఎందుకంటే చాలాసందర్భాల్లో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒకేలా వుండవు. 2004-2009 మధ్య దేశంలోని 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ 14 చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. కాని 2009లో కేంద్రంలో గెలుపు సాధించింది. 2009-14 మధ్య కాలంలో బిజెపి 9 రాష్ట్రాలలో ఓటమి చూసింది. కాని తర్వాత కేంద్రంలో ఆధిక్యత వచ్చింది.. 2012లో ఉత్తర ప్రదేశ్ శాసనసభలోని 403 సీట్లలోనూ 47 మాత్రమే తెచ్చుకున్న బిజెపి 2014లో అక్కడి 80 లోక్‌సభ స్థానాల్లోనూ 71 తెచ్చుకుంది! కనుక అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తర్కం భిన్నంగా వుంటుంది. పైగా ఈ విజయాలు బిజెపి మతవాద రాజకీయాలకు అసహనానికి ఆమోదం అనుకుంటే ఇంకా నష్టం. కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పడిందని కూడా నిరాధరించలేము. ధనాఢ్యవర్గాలు బిజెపిపై ఓటర్లకు మొహం మొత్తిందని గుర్తించిన రోజున తమ అండదండలు మరో పార్టీకి బదలాయించేందుకు సిద్ధంగానే వుంటాయి. ఈ అయిదు రాష్ట్రాలలోనూ చూసినా కాంగ్రెస్‌కు మొత్తం 115 స్థానాలు వస్తే బిజెపికి కేవలం 63 అందులోనూ 60 అస్సాంలో మాత్రమే వచ్చాయి. కనక తీవ్రమైన తేడాలున్నాయి. అయితే కాంగ్రెస్ చావుదెబ్బ తినిలేదని కాదు .బలహీనపడిపోతున్న కాంగ్రెస్‌ను ఎలా పునరుద్దరించుకోవాలనేది ఆ పార్టీ నేతలకు అంతుపట్టడంలేదు. రాహుల్‌గాంధీ ఈ ఓటమికి బాధ్యుడు కాదని చెప్పడంపైనే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కేంద్రీకరిస్తున్నారు. యువతను తీసుకురావాలని దిగ్విజరు సింగ్ వంటివారు బాహాటంగానే చెబుతున్నారు. వెంకయ్య నాయుడు తనపని కాదంటూనే సోనియా గాంధీ కాంగ్రెస్‌లో ఐక్యతా శక్తిగా వుండగలరని సూచిస్తున్నారు.
నిజం చెప్పాలంటే ఈ ఎన్నికల కన్నా 2017, 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరింత ప్రభావశీలమైనవి. ఇప్పుడు కాంగ్రెస్ కేరళ అస్సాం పోగొట్టుకుందంటే యాంటీ ఇంకంబెన్సీ వివరణ వుంటుంది. 2017లో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, పంజాబ్, గోవాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గుజరాత్,గోవా పంజాబ్ తప్ప తక్కినవన్నీ కాంగ్రెస్ పాలనలోనే వున్నాయి. అప్పుడు కూడా దానిపై యాంటీఇంకంబెన్సీ పనిచేయొచ్చు. ఇక మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 18 ఏళ్లుగా బిజెపి పాలన నడుస్తున్నది. అక్కడ బిజెపిపై వ్యతిరేకతా వుందని స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ముఖ్యమంత్రి ఆనందీబెన్ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వమే అసంతృప్తిగా వుందని కథనాలు వచ్చాయి. అలాగే గోవా విషయంలోనూ మనోహర్ పరిక్కర్ను కేంద్రం నుంచి మళ్లీ వెనక్కు పంపితే తప్ప సాధ్యం కాదనే ఆలోచనలు వున్నాయంటున్నారు. పంజాబ్‌లో అకాలీ బిజెపి పాలనపై అసంతృప్తి కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా లేక ఆప్‌కు మరో చోట అధికారం ఇస్తుందా అనే వూహాగానాలు సాగుతున్నాయి. అకాలీదళ్‌పై ఆగ్రహం అధికంగా వుంది. బిజెపి దాన్ని సొమ్ము చేసుకోగల స్థితిలో లేదు. ఇక ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో 80కి 71 తెచ్చుకోవడం వల్లనే మెజార్టి లభించింది. తర్వాత ఉప ఎన్నికల్లోనూ స్థానిక ఎన్నికల్లోనూ చాలా దెబ్బలు తిన్నది. ఈ నేపథ్యంలో యుపిలో ఏం జరుగుతుందనేది ఇంకా కీలక ప్రభావం చూపనుంది. అయితే 2018లో బిజెపి ప్రధాన రాష్ట్రాలైన రాజస్థాన్,మధ్య ప్రదేశ్,చత్తీష్ఘర్లలో ఓడిపోతే మాత్రం మోడీకి గడ్డు కాలంతప్పదు. వీటితో పాటు మేఘాలయ, త్రిపుర,మిజోరాం లలో కూడా శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.అప్పుడు కూడా అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలను ఒకే కొలబద్దతో పరిశీలించడానికి లేదు గాని కేంద్ర సమచానికి అవి దగ్గరగా వుంటాయి