తమిళనాడులో జయలలిత రెండవ సారి రావడం చారిత్రాత్మకెమనీ, వ్యక్తిగత ఆకర్షణ, మొండితనంతోపాటు సంక్షేమ పథకాలు, భారీ తాయిలాలు కూడా విజయానికి బాటవేశాయని చెబుతున్నారు గాని అదీ కొంతవరకూ కారణం. మంత్రుల తొలగింపు, జైలుశిక్షల వంటివి కూడా జరిగాయి. అయినా సరే విజయం సాధించారంటే అవినీతి ఆరోపణలను బట్టి మాత్రమే తీర్పులు వుండవని అంగీకరించవలసిన స్థితి. పాలకవర్గాలు అవినీతిని అంతగా అలవాటు చేసి మామూలు అంశంగా మార్చేశాయన్న మాట. ఇక వ్యక్తిగత పోకడలు ఏకపక్ష నిరంకుశత్వం వంటి విషయాల్లోనూ వీరికి పోలికలున్నాయి.
తమిళనాడులో ప్రతిపక్షాల ఓట్ల చీలిక, రకరకాల కులాల వేరు కుంపట్లు అన్నీ కలసినా జయలలిత గతసారి కన్నా తక్కువతోనే గెలిచారు. మెజార్టిలు కూడా తక్కువే. కరుణానిధి కుటుంబ సపరివార అవినీతి, అరాచకం కూడా ప్రజలకు మింగుడు పడలేదు. అయితే డిఎంకెకు వచ్చిన 90 సీట్ల బలం కూడా తక్కువ కాదు.ఇంతబలమైన ప్రతిపక్షం అక్కడ ఎప్పుడూ లేదు. పాలకపక్షంపై అసంతృప్తి కూడా గట్టిగా వుంది గనకే చెన్నైలో ఘోరంగా ఓడిపోయింది. జయలలితకు కూడా బిజెపి ఓటింగు తోడైంది. 18 స్థానాల్లో ఎడిఎంకె 3000 లోపు ఓట్ల ఆధిక్యతతోనే గెలిచింది. ఇందులో పదింటిలో అయితే వెయ్యి లోపే తేడా. డిఎంకెతో లేదా దాని మద్దతు గల కాంగ్రెస్‌తో ఎడిఎంకె ముఖాముఖి తలపడిన 12 చోట్ల తేడా మరీ తక్కువగా వుంది. రాధాపురంలో 49, కత్తుమనార్ కోయిల్‌లో 87 ఓట్లతోనే ఎడిఎంకె బయిటపడింది. కనుక ప్రధానంగా ఓట్ట చీలిక ఆమె మరోసారి గెలవడానికి దోహదం చేసిందనుకోవాలి. అయితే ఇప్పటికీ ఆమె అవినీతి కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువడవలసే వుంది. ఇప్పటికి మాత్రం ఆమె తిరుగులేని నాయకురాలుగానే వుంటారు.