దేశంలో సమస్యాత్మక రాష్ట్రాలైన కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పంజాబ్(ఇప్పటికి),గుజరాత్,రాజస్థాన్‌లు బిజెపి పాలనలోనే వుండటం రాజకీయంగా చాలా కీలకమైన పరిణామం. మామూలుగా ఇక్కడి పరిస్థితిపై బిజెపి విమర్శలు చేయడం ఉద్యమాలు నడపడం పరిపాటి. మరి తానే అధికారంలో వుంటే ఏం చేస్తుందో ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తాం.
అస్సాంలోనూ గత పాలక పార్టీ అస్సాం గణపరిషత్(ఎజిపి) బలహీనపడిపోయిన శూన్యాన్ని సొమ్ము చేసుకోబట్టే దానితో కలిసే బిజెపి వచ్చింది. బోడోపీపుల్స్ ఫ్రంట్‌ను కూడా చేరువ చేసుకుంది.ఈశాన్యాన బిజెపి ప్రభుత్వ విధానాలు ఎలా వుంటాయి ఏ ప్రభావం చూపిస్తాయన్నది కూడా పరిశీలించాల్సిందే. ఎందుకంటే 34 శాతం ముస్లిం జనాభా, బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య, అనేక రకాల ఉపజాతి కలహాలు ఆదివాసీ సమస్యలు వున్న రాష్ట్రం అది. ఎన్నికల ప్రచార సందర్భంలో బిజెపి చాలా దారుణంగానే ముస్లిం దురాక్రమణల గురించి మొగలాయిలను ఓడించిన గతం గురించి మాట్లాడింది. హిందూ శరణార్థులకు మాత్రం పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అసలు 1951 పౌరసత్వ చట్టాన్ని పునరుద్ధరిస్తానన్నది. బోడోలతో దానికి పొత్తు వుండగా బలం కొద్దిగా తగ్గిన ఐఎంయుడిఎఫ్ ఆగ్రహంగా వుంది. ఇలాటి శక్తులు ఏం చేస్తాయనేది జాగ్రత్తగా చూడాలి. కాశ్మీర్ విద్యాసంస్థలలో సంఘర్సణ వంటివి గనక అస్సాంలో తలెత్తితే పరిస్థితి తీవ్రంగా వుంటుంది. ముఖ్యమంత్రి కాబోతున్న సర్వానంద సబర్వాల్ ఇప్పటికే బంగ్లాదేశ్‌తో సరిహద్దును రెండేళ్లలో మూసేస్తామని ప్రకటించారు. ఇవన్నీ ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయి.