తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామా రావు అమెరికాలో పర్యటిస్తున్నారు. సోమవారం నుంచి ఎనిమిది రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 11.15కు ఆయన షికాగో చేరుకుంటారు. సాయంత్రం 4.15కు ఇండియానా పోలీస్ వెళ్తారు.
అక్కడ ముందుగా నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. ఇందుకోసం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. అలా పలు రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత శుక్రవరం 27వ తేదీన లాస్ ఏంజిలిస్ చేరుకుంటారు,
అనంతరం సోమవారం 30న ఆయ బే ఏరియా వెళ్తారు. దిగ్గజ కంపెనీల అధిపతులతో భేటీ అవుతారు. టీఎస్ ఐపాస్, ఇంకా ఇతర అంశాల గురించి బిజినెస్ లీడర్స్ కు అవగాహన కల్పిస్తారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపిస్తే లభించే రాయితీలు, ప్రయోజనాల గురించి తెలియజెప్తారు.
ఇప్పటికే అమేజాన్ అమెరికా బయట అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేస్తోంది. యాపిల్ మ్యాపింగ్ సెంటర్ కూడా హైదరాబాదు లోఏర్పాటు కాబోతోంది. ఇంకా వివిధ దేశాల కంపెనీలు తెలంగాణ బాట పట్టాయి. భారీగా పెట్టుబడులు ఆశించడం, కంపెనీల స్థాపనకు ప్రోత్సహించడం ద్వరా యువతకు ఉఫాధి అవకాశాలు పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు కేటీఆర్ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.