దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల. మైనారిటీల ఓట్లు పొందకుండా దేశాన్ని పాలించడం సాధ్యం కాదు. కొన్నేళ్ల క్రితం చాలా మంది అభిప్రాయమిది. రాజకీయ ప్రత్యర్థులే కాదు, ఎంతో మంది పరిశీలకులు కూడా ఇలాగే చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014లోనే ఈ అంచనాలు తప్పని రుజువైంది. తాజాగా అస్సాంలో సంచలన విజయంతో మరింత స్పష్టత వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కు కలవరపాటు కలిగిస్తున్న విషయం ఇదే.
దేశంలో ముస్లింలు, క్రైస్తవుల ప్రాబల్యం గల సీట్లు చాలానే ఉన్నాయి. అయినా, 2014లో మోడీ ప్రభంజనం కారణంగా బీజేపీ 282 సీట్లు గెల్చుకుంది. ముస్లింలు 19 శాతం ఉన్న యూపీలో బీజేపీ తన మిత్ర పక్షంతో కలిసి 72 లోక్ సభ సీట్లను గెల్చుకుంది. ముస్లింలు 25 శాతం పైగా ఉన్న బెంగాల్లో ఒకప్పుడు బీజేపీ నామమాత్రం. అలాంటి రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లను గెలవడమే కాదు, దాదాపు 17 శాతం ఓట్లు పొందింది.
31 శాతం ముస్లిం జనాభా ఉన్న అస్సాంలో బీజేపీ 7 సీట్లు గెల్చింది. కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో ఇంకా అనేక రాష్ట్రాల్లో ఈ అడ్డంకిని బీజేపీ అధిగమించి విజయ దుందుభి మోగించింది. అదంతా ఏదో మోడీ హవా, లేదా యూపీఏ వ్యతిరేకత ప్రభావం అని అభిప్రాయాలు వినిపించాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయాలు కాంగ్రెస్ కు కలవరం కలిగించే స్థాయిలో ఉన్నాయి. సుమారు 31 శాతం ముస్లిం జనాభా ఉన్న అస్సాంలో బీజేపీ కూటమి మూడింట రెండు వంతుల సీట్లను గెల్చుకుంది. కాంగ్రెస్ నామమాత్రపు స్థాయికి పడిపోయింది. మోడీ, బీజేపీ అభివృద్ధి నినాదం ప్రభావంతో అనేక చోట్ల ముస్లింలు కూడా కమలం గుర్తుకు ఓట వేశారని కొందరు పరిశీలకులు విశ్లేషించారు.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దాదాపు సమాన సంఖ్యలో ఉన్న కేరళలో బీజేపీ నామమాత్రపు పార్టీ అని మొన్నటి వరకూ పేరుండేది. తొలిసారిగా కేరళలో ముక్కోణప పోటీ జరగడానికి కారణం, బీజేపీ బలపడటం. గెలిచింది ఒక్క సీటే అయినా, చాలా నియోజకవర్గాల్లో బీజేపీ గణనీయ ప్రభావం చూపింది. ఫలితాలను ప్రభావితం చేసిందని పరిశీలకుల అభిప్రాయం.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లలోనూ ఈ అడ్డంకిని దాటేస్తామని కమలనాథులు ధీమాగా చెప్తున్నారు. గుజరాత్ లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన మోడీ ప్రభావంతో, అక్కడ బీజేపీకి గణనీయంగానే ముస్లిం ఓట్లు లభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా యువత మోడీ వైపు మొగ్గుచూపడం కొత్తేమీ కాదు.
గుజరాత్ అల్లర్లలో ఏంజరిగిందో తెలియదు కానీ, మోడీ హయాంలో అభివృద్ధి జరిగింది. మాకు ఉద్యోగాలు దొరికాయని ముస్లిం యువత సంతోషంగా ఉన్నట్టు అనేక సర్వేలు తేల్చాయి. అంతేకాదు, వివిధ అంశాల్లో దేశం మొత్తం మీద గుజరాత్ లోనే ముస్లింల స్థితిగతులు బాగున్నాయని ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ సాధికారికంగా, గణాంకాలతో వెల్లడించింది. అప్పట్లో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న బెంగాల్ కంటే, కాంగ్రెస్ పాలనలో ఉన్న వివిధ రాష్ట్రాల కంటే గుజరాత్ లో ముస్లింలకు విద్య, ఉద్యోగావకాశాలు ఎక్కువని సచార్ కమిటీ తెలిపింది.
ముస్లింలను మనుషుల్లా కాకుండా ఓటు బ్యాంకుగా చూడటం ఈ దేశంలో స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచీ ఉన్నదే. చాలా పార్టీలు అదే పనిచేశాయి. మీరు ఓటు బ్యాంకు కాదు, అభివృద్ధి ఫలాలు పొందడానికి మీరు కూడా అర్హులంటూ మోడీ చెప్తున్న మాటలు వారికి కొత్తగా ఉన్నాయి. అందుకే, అనేక చోట్ల యువత ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. ముందు ముందు మరింత ఎక్కువగా మైనారిటీల ఓట్లను సాధిస్తామని బీజేపీ నమ్మకంగా ఉండటానికి కారణం ఇదే కావచ్చు.