అంతరిక్ష పరిశోధన రంగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈరోజు మరో అపూర్వ విజయం సాధించింది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు పునర్వినియోగించుకోగల ఆర్.ఎల్.వి-టిడి ఉపగ్రహవాహక నౌక (శాటిలైట్ లాంచింగ్ వెహికల్) ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈరోజు ఉదయం ఏడు గంటలకు నింగిలోకి దూసుకుపోయిన ఆర్.ఎల్.వి-టిడి ఉపగ్రహవాహక నౌక, శబ్దధ్వనికి ఏడు రెట్ల వేగంతో భూమి నుంచి సుమారు 70 కిమీ నిర్దిశిత మార్గంలో ప్రయాణించి, బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రన్ వే పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ మొత్తం ప్రయోగం కేవలం 11 నిమిషాలలో విజయవంతంగా ముగియడంతో ఇస్రోలో అందరు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, దేశ విదేశాల ప్రముఖులు, శాస్త్రజ్ఞులు ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందిస్తున్నారు.
ఈ ఆర్.ఎల్.వి-టిడి ఉపగ్రహవాహక నౌకని ప్రయోగం కోసమే రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో దీని ఆధారంగా పూర్తిస్థాయి ఉపగ్రహవాహక నౌకని తయారుచేస్తామని ఇస్రో చైర్మన్ చెప్పారు. దాని వలన ఉపగ్రహ ప్రయోగాల ఖర్చు కనీసం 10 రెట్లు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇస్రో చాలా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షంలోకి ఉపగ్రహాలు ప్రవేశపెడుతున్నందున అనేక చిన్న పెద్ద దేశాలు ఇస్రోని ఆశ్రయిస్తుండటంతో అంతరిక్ష వ్యాపారంలో ఇస్రో దూసుకుపోతోంది. ఈరోజు ప్రయోగించిన ఆర్.ఎల్.వి-టిడి ఇంకా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించగలిగితే ఇంక ఇస్రోకి అంతరిక్ష వ్యాపారంలో తిరుగు ఉండదు.