ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పరాంకుశం వేణుగోపాల్ ఆకస్మికంగా నిన్న తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు హైకోర్టులో తన కార్యాలయాన్ని కూడా ఆయన వెంటనే ఖాళీ చేసేసారు. వ్యక్తిగత కారణాల చేతనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టు, సుప్రీం కోర్టులో అనేక కీలకమైన కేసులను వాదిస్తున్న వేణుగోపాల్ ఇంత అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కారణాలు తెలియవలసి ఉంది.
విభజన చట్టంలో 10వ షెడ్యూల్ క్రిందకి వచ్చే సంస్థలలో ఏపికి న్యాయంగా రావలసిన వాటాని ఇవ్వకుండా తెలంగాణా ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టు వేసిన కేసుని ఆయనే వాదిస్తున్నారు. ఆయన చాలా సమర్ధంగా వాదించిన కారణంగానే కోర్టు తీర్పు ఏపికి అనుకూలంగా వచ్చింది. ఆయన పనితీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఇంత హటాత్తుగా ఎందుకు రాజీనామా చేశారో ఇంకా తెలియవలసి ఉంది. ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ పనిచేస్తున్నారు. వేణుగోపాల్ స్థానంలో ఏపి ప్రభుత్వం ఆయనను నియమిస్తుందేమో?