ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరుని నిత్యం స్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన నీడలో నుంచి బయటపడి తన స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వ పధకాలకు ఎన్టీఆర్ పేరుకు బదులు ఇప్పుడు అన్నీ ఆయన పేరే పెట్టుకోవడం గమనిస్తే ఆ అనుమానం నిజమనిపించక మానదు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఎన్టీఆర్ భరోసా పధకాలే ఉండగా, చంద్రబాబు నాయుడు పేరిట చంద్రన్న కానుకలు, గిరిజన బాట, దళిత బాట, రుణమేళ, ఉద్యోగ మేళ, చేయూత, రేషన్ వంటివి అనేకం ఉన్నాయి. చివరికి మొన్న వేసవిలో మజ్జిగ పంపిణీకి కూడా ఆయనే పేరే పెట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది చాలా సాధారణమే కానీ చంద్రబాబు నాయుడుని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆయన ఎన్టీఆర్ నామస్మరణ చేస్తుండటం, పరిస్థితులు మళ్ళీ అదుపులోకి వచ్చినట్లు కనిపించగానే తనను తాను హైలైట్ చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయితే ప్రస్తుతం ప్రభుత్వ పధకాలన్నిటికీ చంద్రబాబు నాయుడి పేరే పెట్టుకోవడం స్వర్గీయ ఎన్టీఆర్ ని పక్కనపెట్టినట్లు భావించనవసరం లేదు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ని పక్కనబెట్టడం సాధ్యం కాదు. పెడితే దాని వలన తనకే తీవ్ర నష్టం కలుగుతుందనే సంగతి చంద్రబాబు నాయుడు తెలియదనుకోలేము. కానీ ప్రభుత్వ పధకాలకి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టకుండా తన పేరే ఎందుకు పెట్టుకొంటున్నారు అనే సందేహం కలుగకమానదు. దానికి కారణం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగ తెదేపా-భాజపాల సంబందాలేనని భావించవచ్చు. వచ్చే ఎన్నికలలో అవి కలిసే పోటీ చేస్తాయో లేదో తెలియదు. కనుక ఇప్పటి నుంచే ప్రభుత్వ పదకాలన్నిటికీ చంద్రన్న పేరు తగిలిస్తే, వాటి గురించి గొప్పగా ప్రచారం చేసుకొని ప్రజలను ఆకర్షించవచ్చునని తెదేపా భావిస్తోందేమో? కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కూడా చంద్రన్న పేరు తగిలించి తెదేపా పద్దులో వ్రాసేసుకొంటున్నారని రాష్ట్ర భాజపా నేతలు ఆరోపించడమే అందుకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.