కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న డిల్లీ ఫై.టి.ఐ.వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “సోనియా గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏనాడో ముక్కలు చెక్కలయ్యేది. ఆమె కారణంగానే ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది. రాహుల్ గాంధీకి ఆ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనేది వారి అంతర్గత విషయం. దానిపై నేనేమీ మాట్లాడను. కానీ కాంగ్రెస్ నేతలు అనువంశిక పాలననే ఎక్కువ ఇష్టపడతారు. ఒక్కో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు… భాజపాని ఆదరిస్తున్నారు. కారణం కాంగ్రెస్ హయంలో అవినీతికి పెద్దపీట వేస్తే, భాజపా హయాంలో దానిని తొలగించి అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విషయంలో వెంకయ్య నాయుడు చెప్పింది అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజమని చెప్పవచ్చు. ఎందుకంటే నేటికీ పార్టీ పగ్గాలను తన ముద్దులు కొడుకు రాహుల్ గాంధీకి అప్పగించడానికి సోనియా గాంధీ భయపడుతున్నారంటే కారణం వెంకయ్య చెప్పినదే. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ప్రయత్నించిన ప్రతీసారి ఆ పార్టీలో సీనియర్ నేతలే అసమ్మతి స్వరాలాపన చేస్తూ ఆయన నాయకత్వ లక్షణాల గురించి ప్రశ్నిస్తుంటారు. రాహుల్ గాంధీకి బదులు ప్రియాంకా వాద్రాకి పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తుంటాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు అంగీకరించిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం లేకపోతే రాహుల్ గాంధీని కానీ ప్రియాంకా వాద్రాని గానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని సూచించడం గమనిస్తే, రాహుల్ గాంధీ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుగా మాత్రమే సరిపోతారని చెప్పినట్లు భావించవచ్చు.
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీని నడిపించగల శక్తియుక్తులు లేనప్పటికీ, ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తే, అప్పుడు వెంకయ్య నాయుడు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలు అవడం ఖాయం. అందుకే సోనియా గాంధీ ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీని కొడుకు చేతిలో పెట్టలేకపోతున్నారని భావించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీని తమ కుటుంబం చేతిలో నుంచి జారిపోకుండా జాగ్రత్తపడుతూ ప్రియాంకా వాద్రాని ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లున్నారు.