తమిళనాడు రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి జయలలిత సరికొత్త రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ సమావేశ మందిరంలో ఆమె చేత ఆ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య ఇవ్వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో బాటు 28మంది మంత్రులుగా సామూహిక ప్రమాస్వీకారం చేశారు. వారిలో 13మంది కొత్తవారు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే, తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన ప్రతిపక్ష నేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ కి జయలలిత ప్రత్యేక ఆహ్వానాలు పంపడం. పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలను వారి ఇళ్ళకు పంపి ఆహ్వానపత్రాలు అందజేశారు. ఆమె అభ్యర్ధనను మన్నించి డిఎంకె తరపున స్టాలిన్ హాజరయ్యారు. ఎన్నికలలో అన్నాడిఎంకెతో పొత్తులు పెట్టుకోవాలని ఆశపడి భాజపా భంగపడిన సంగతి అందరికీ తెలిసిందే.
భాజపా, కేంద్ర ప్రభుత్వం తరపున ఎం. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఆయన హాజరవడం జయలలిత పట్ల తమకు ఆగ్రహం లేదని సూచిస్తున్నట్లే ఉంది. ఒకవేళ ఆమె అంగీకరిస్తే 2019లో జరిగే లోక్ సభ ఎన్నికలలో అన్నాడిఎంకెతో పొత్తులు పెట్టుకోవాలని భాజపా భావిస్తోందేమో? ఎందుకంటే 2019 లోక్ సభ ఎన్నికలు భాజపాకి చాలా కీలకమైనవి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే, ఆ ఎన్నికలలో తప్పనిసరిగా గెలిచితీరాలి. వాటికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే జయలలితను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేయడం మంచిదని భాజపా భావిస్తోందేమో?