తాము గెలిస్తే పారదర్శక పరిపాలన అందిస్తామని నరేంద్ర మోడీ ఎన్నికల సభల్లో పదే పదే హామీ ఇచ్చారు. లెస్ గవర్న మెంట్ మోర్ గవర్నెన్స్ అంటూ కొత్త పదాన్ని పరిచయం చేశారు. తీరా ఇప్పుడు ఆయన ప్రభుత్వం తెస్తున్న చట్టం పారదర్శకతకు తూట్లు పొడిచేలా ఉంది. అలాగే, అవినీతిని బయటపెట్టే విజిల్ బ్లోయర్లు, లేదా ప్రజా వేగుల హక్కులను హరించేదిగా ఉంది.
విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ (ఎమెండ్ మెంట్) బిల్ 2015ను ఇప్పటికే లోక్ సభ ఆమోదించింది. ఇప్పుడిది రాజ్యసభలో ఉంది. అక్కడా ఆమోదం పొందితే చట్టంగా మారి ప్రశ్నించేవారి గొంతును నొక్కడానికి తయారవుతుంది. కొత్త చట్టం ప్రకారం, ఒక ఫిర్యాదును సంబంధిత అధికారి పరిగణనలోకి తీసుకోవాలంటే అది 34 పరీక్షలను నెగ్గాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే అవినీతిపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మరో మార్గంలో సంపాదించిన సమాచారం ఆధారంగా ఫిర్యాదుచేస్తే పట్టించుకోరు.
ఇది చాలా అన్యాయమని ఇప్పటికే పలువురు ప్రజావేగులు అభ్యంతరం చెప్తున్నారు. సమాచారం అనేది వివిధ మార్గాల్లో వస్తుంది. ప్రతిదీ సమాచార హక్కు చట్టం ద్వారానే పొందాలంటేకొన్నిసార్లు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం సమాచారం పొందడంలోనూ అనేక మినహాయింపులున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే అనేక రంగాల్లో అవినీతిని ప్రశ్నించడానికి అవకాశం ఉండదు.
రక్షణ రంగం, రక్షణ ఉత్పత్తుల కొనుగోలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు, దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే అంశాలపై ఫిర్యాదులను స్వీకరించే అవకాశం లేదు. అంటే ఈ షరతుల వంకతో ఆయా రంగాల్లో జరిగే అవినీతిని ప్రశ్నించకుండా చేస్తున్నారని సహ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే వ్యాపం విజిల్ బ్లోయర్లు ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండేలకు అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. దాడులు జరిగాయి. వారికి మరింత రక్షణ కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. పారదర్శకతను కాపాడాలంటే ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని విజిల్ బ్లోయర్లు కోరుతున్నారు. కేంద్రం మాత్రం ప్రశ్నించే వారికి పరిమితులు విధిస్తూ చట్టం తెస్తోంది.
అయితే విజిల్ బ్లోయర్ల రక్షణకు మాత్రం ఇందులో కొంత భరోసా ఉంది. ఏదైనా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదు వస్తే, విచారణ మొదలయ్యే వరకూ ఫిర్యాదుదారు పేరు బయటపెట్టకూడదనే నిబంధన ఉంది. ఇది విజిల్ బ్లోయర్ కు రక్షణనిస్తుంది. విచారణ పూర్తయి తుది నిర్ణయం వెలువడే వరకూ సంబంధిత అధికారి ఆ వివరాలను వెల్లడించ కూడదు. అంటే, అవినీతిపై జరుగుతున్న విచారణలో ఏయే అంశాలు వెలుగు చూశాయనేది అందరికీ చెప్పకూడదు. ఇలాంటి కొన్ని షరతులు విజిల్ బ్లోయర్లకు ఊరటనిస్తాయి.