కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కులాల ప్రస్తావన లేని గురుకులాల్లో విద్యాబోధన చేయాలని సంకల్పించారు. పన్నెండో తరగతి వరకూ గురుకులాల్లో ఉచితంగా సిబిఎస్ఇ సిలబస్ బోధించాలని నిర్ణయించారు. అటు ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఇటు మాతృ భాషపై పట్టు పెంచుకోవడం అనే ద్విముఖ వ్యూహంతో విద్యావిధానాన్ని కొనసాగించాలనేది ఎంతో వివేచనతో కూడిన నిర్ణయం. ఆంగ్లంలో చదవడం అంటే తెలుగును మర్చిపోవడం కాదనేది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. మాతృభాషకు దూరం కావడమంటే కన్నతల్లికి దూరం కావడమని ఎంతో మంది భాషాభిమానుల అబిప్రాయం. కేసీఆర్ కు సైతం భాషపై ఎంతో మమకారం ఉంది. సాహిత్యంపై అనురక్తి ఉంది. కాబట్టి తెలుగును విస్మరించరాదని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు.
ముఖ్యంగా గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం విప్లవాత్మకం అవుతుంది. ప్రస్తుతం కులాల వారీగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లున్నాయి. ఎవరికి వారే అనే తరహాలో హాస్టళ్లలో చదువుతుంటారు. ఆ ప్రభావం బడిలో, కాలేజీలో కూడా కనిపిస్తుంటుంది. తక్కువ కులం వారంటూ కొందరిని కించ పరచడం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది వారిలో న్యూనతా భావాన్ని పెంచుతుంది. 21వ శతాబ్దంలోనూ ఫలానా కులం వారు అంటరాని వారని ముద్ర వేసే పరిస్థితి కొనసాగుతున్నది వాస్తవం. ఇకముందు కులాలు లేని గురుకులాలు వస్తే సాటి విద్యార్థిని కులం పేరుతో కించ పరిచే దౌర్భాగ్యం దూరమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, పసి మనసుల్లో కులం అడ్డుగోడలు తొలగడానికి కూడా అవకాశం ఉంటుంది.
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో కుల సంఘాలకు గదులిచ్చి విభేదాలను ప్రోత్సహించారు. కులాలవారీగా విద్యార్థులు నిలువునా చీలిపోయారు. ప్రతిదానికీ కులమే ప్రాతిపదిక అయింది. చివరికి దీని పర్యవసానం ఎంత భయంకరంగా ఉందో చూస్తూనే ఉన్నాం. దారుణమైన వేధింపులు భరించలేక రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకుందామంటే కులాల పేరుతో నిరసనలు చోటు చేసుకున్నాయి. మనుషుల మధ్య కులం అనే అంతరం ఎంత అనర్థానికి దారితీస్తుందో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, విద్యా వ్యవస్థలో అయినా కులాల గొడవ లేకుండా చూడాలనేది గొప్ప సంకల్పం.
అన్ని కులాల వారికీ కామన్ గురుకులాల వ్యవస్థ వస్తే, వచ్చే తరం నుంచి కులాల అడ్డుగోడలు చాలా వరకూ తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే, విద్యా ప్రమాణాలు, నాణ్యతపైనా కేసీఆర్ దృష్టి పెట్టాల్సి ఉంది ఇప్పుడున్న స్థాయిలోనే విద్యాబోధన జరిగితే ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాటి పోటీ వాతావరణానికి అనుగుణమైన సిలబస్ ను రూపొందించడం, దాన్ని సమర్థంగా బోధించేలా ముందు టీచర్లకూ తగిన శిక్షణనివ్వడం కూడా కీలకమే. ఎన్నికలకు ముందు నుంచీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు.
కాస్త ఆలస్యమైనా పకడ్బందీగా అమలు చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. హడావుడిగా ప్రారంభించి అభాసుపాలు కావడం ఆయనకు ఇష్టం లేదు. ఇప్పటికే ఇంటర్లో ఉచిత విద్యను ప్రకటించారు. ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఎన్నో ప్రణాళికలున్నాయి. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే విద్యా వ్యవస్థ బలమైన పునాది అని ఆయన నమ్మకం. అందుకే, కులాలు లేని గురుకులాలు అనే విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఇది సమర్థంగా అమలైతే బంగారు తెలంగాణ సాధన మరింత సులువవుతుంది.