తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తనను రెండవసారి మళ్ళీ ఎన్నికలలో గెలిపించినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ప్రజలపై ఈరోజు వారాల జల్లు కురిపించేరు.
మొదటి హామీ-పంట రుణాల మాఫీ. దానిని తక్షణం అమలుచేస్తూ ఆమె సంబంధిత ఫైల్ పై సంతకం చేశారు. ఈ హామీలో భాగంగా మార్చి 31, 2016 వరకు వివిధ కో-ఆపరేటివ్ బ్యాంకుల వద్ద రైతులు తీసుకొన్న రూ.5, 780 కోట్లు మాఫీ చేయబడుతుంది. ఈ రుణాలలో స్వల్ప, మద్య, దీర్ఘకాలిక రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయబడుతాయి.
2వ హామీ: ఉచిత విద్యుత్ సరఫరా: నేటి నుంచే గృహావసరాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని వలన ప్రభుత్వ ఖజానాపై రూ.1,607 అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, యాంత్రిక మగ్గాలకు 750 ఉచిత విద్యుత్ మంజూరు చేశారు.
3వ హామీ: రాష్ట్రంలో దశల వారిగా మద్య నిషేధం అమలు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న 500 మద్యం దుఖాణాలను మూసివేయాలని జయలలిత ఆదేశాలు జారీ చేసారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు, బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా కుదించి వేశారు. మాధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వం చాలా బారీ ఆదాయం కోల్పోబోతోంది.
4వ హామీ: రాష్ట్రంలో నిరుపేద ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం ఇంతవరకు ప్రభుత్వం రూ.25,000 ఆర్ధిక సహాయం, మంగళ సూత్రాల కోసం4 గ్రాముల బంగారం ఇస్తోంది. నేటి నుండి రూ.50,000 ఆర్ధిక సహాయం 8 గ్రాముల బంగారం ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ హామీలే కాక ఆమె ఇంకా ప్రజలకు ఏసీలు, స్కూటీలు, మోటార్ సైకిళ్ళు వగైరా ఉచితంగా పంచి పెడతానని హామీ ఇచ్చారు. వాటినన్నిటినీ అమలు చేయడానికి కొన్ని వేల కోట్లు అవసరం ఉంటుంది. వాటికి డబ్బుని ఆమె ప్రభుత్వ ఖజానా నుంచే తీయవలసి ఉంటుంది. కానీ ఈరోజు ఆమె ప్రకటించిన వరాల వలన ప్రభుత్వం ఖజానా ఆదాయం బారీగా తగ్గిపోవడమే కాకుండా అదనపు భారం కూడా పడబోతోంది. కనుక ఆ హామీలనన్నిటినీ అమలు చేయాలంటే మళ్ళీ ప్రజలపైనే కొత్త పన్నులు విధించక తప్పకపోవచ్చు.