అసోం అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికారం దక్కించుకొన్న భాజపా ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తర ప్రదేశ్ దృష్టి పెట్టినట్లుంది. ఆ రాష్ట్రంలో మాయావతి నేతృత్వంలోని బి.ఎస్.పి.తో పొత్తులు పెట్టుకోవడం లేదా చిన్నా చితకా పార్టీలన్నిటితో కలిసి అధికార సమాజ్ వాదీ, ప్రతిపక్ష బి.ఎస్.పి.లను ఎదుర్కోవాలని భాజపా అధిష్టానం యోచిస్తోంది. ఒకవేళ మాయావతి తమతో పొత్తులకు అంగీకరించకపోతే, ఆమెను, సమాజ్ వాదీ పార్టీని ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.
రాజ్ నాథ్ అభ్యర్ధిత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఆ రాష్ట్రంలో వరుసగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి భాజపా సిద్దం అవుతోంది. భాజపా ప్రభుత్వం కేంద్రంలో రెండేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈనెల 26న షహరాన్ పూర్ లో భాజపా బారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబోతోంది. దానికి భాజపా అగ్రనేతలు చాలా మంది హాజరవుతారని తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన లక్నోలో రాష్ట్ర భాజపా దళిత నేతలతో సమావేశం అవుతారు. మళ్ళీ జూన్ నెల 12,13 తేదీలలో అలహాబాద్ లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.
అలాగే అధికార పార్టీలో అసంతృప్తులను తనవైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సమాజ్ వాదీ ఎంపి జగదీశ్ రాణా సోమవారం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో భాజపాలో చేరారు. వచ్చే ఏడాదిలోగా ఉత్తర ప్రదేశ్ లో వీలయినంత ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడానికి భాజపా సిద్దం అవుతోంది.
అయితే ఉత్తర ప్రదేశ్ లో విజయం సాధించడం అంత తేలిక కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ చాలా బలంగా ఉంది. అది కాంగ్రెస్ తో పొత్తులకు సిద్ధంగా ఉన్నామని అప్పుడే ప్రకటించేసింది. కానీ అది ఒక విచిత్రమైన షరతు పెట్టింది. 2019 ఎన్నికలలో ములాయం సింగ్ ని యూపియే కూటమి తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో దానితో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అది కాంగ్రెస్ పార్టీకి సమ్మతం కాదు కనుక మాయావతితో చేతులు కలిపి కానీ లేదా ఒంటరిగా గానీ పోటీ చేయడానికి సిద్దం అవుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టే బాధ్యత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి అప్పగించింది. ఈ ఎన్నికలతోనే ప్రియాంకా వాద్రాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం భాజపాకి అంత సులువు కాదు. కానీ ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నిస్తే అసాధ్యం కూడా కాదని చెప్పవచ్చు.