సినిమావాళ్లకి రాజకీయాలకి విడదీయలేని అనుబంధం ఏర్పడినట్లే ఇప్పుడు స్వామీజీలు, వివిధ మతాచార్యులకు కూడా రాజకీయాలతో అనుబంధం పెరిగింది. వారిలో విశాఖలో శారదా పీఠాదిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా ఒకరని చెప్పక తప్పదు. ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర పాలనా వ్యవహారాల గురించి విమర్శలు, వ్యాఖ్యలు చేస్తుంటారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనని అప్పుడప్పుడు కలుస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన కూడా జగన్ కి అనుకూలంగా మాట్లాడుతుంటారు.
మొన్న ఆదివారం విజయవాడలో నిర్వహించిన విప్రోత్సవం కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కమీషన్ పై విమర్శలు చేశారు. దానికి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా నిధులు కేటాయించడం లేదని, కేటాయించిన నిధులను తెదేపాలో బ్రాహ్మణ కార్యకర్తలకు మాత్రమే ఇస్తోందని స్వామీజీ విమర్శలు గుప్పించారు. ఆ కారణంగా రాష్ట్రంలో అనేక మంది పేద బ్రాహ్మణులకు కార్పోరేషన్ నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని, ప్రభుత్వం బ్రాహ్మణులకు చాలా అన్యాయం చేస్తోందని స్వామీజీ ఆవేదన చెందారు.
ఊహించినట్లుగానే తెదేపా నుంచి స్వామీజీకి చాలా ఘాటుగా సమాధానం వచ్చింది. తెదేపా బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ ఎస్. శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి చెప్పమన్న మాటలనే స్వామీజీ చెపుతున్నట్లున్నారు. అయనకి రాజకీయాల మీద అంతగా మోజు ఉన్నట్లయితే ఆ స్వామీజీ ముసుగు తీసేసి వైకాపాలో చేరి మాట్లాడితే బాగుంటుంది,” అని సలహా ఇచ్చారు.
రాగద్వేషాలకు, భౌతిక సుఖాలు, భౌతిక విషయాలకు అతీతంగా మెలగుతూ కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కావలసిన స్వామీజీలు కూడా సామాన్య ప్రజలలాగే వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతూ, రాజకీయాల గురించి మాట్లాడటం వలననే వారు కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. రాజకీయ నాయకులు ప్రజలను ఓటు బ్యాంకులుగా చూస్తుంటారు. ఆ ప్రజల ఓట్లను టోకుగా చేజిక్కించుకోవడానికే వారు స్వామీజీలను, మత గురువులను గాలం లాగ వాడుకొంటారు. బహుశః ఆ విషయం స్వామీజీలకి, మత గురువులకి కూడా తెలిసే ఉంటుంది. కానీ వారు ఎంత సర్వసంగ పరిత్యాగులైనప్పటికీ వారికి కూడా ఏవో ఒక అవసరాలు ఉంటూనే ఉంటాయి కనుక రాజకీయ నేతలతో రాసుకుపూసుకు తిరగక తప్పడం లేదు. కనుక వాళ్ళు కూడా పార్టీల వారిగా చీలిపోక తప్పలేదు. ఒక పార్టీని భుజానికెత్తుకొన్నాక మత గురువులకైనా దానికి అనుగుణంగానే మాట్లాడక తప్పదు కదా? బహుశః అందుకే స్వరూపానందేంద్ర స్వామీజీ కూడా వైకాపా లైన్ లో మాట్లాడినట్లున్నారు.