బళ్ళారిలో అక్రమ గనుల త్రవ్వకాలకు పాల్పడిన గాలి జనార్ధన్ రెడ్డి సోదరులను వెనకేసుకు వచ్చినందుకు సుష్మా స్వరాజ్ ఇంతకు ముందు విమర్శలు మూటగట్టుకొన్నారు.ఆమె చొరవ వలననే గాలికి జైలు నుండి విముక్తి లభించిందని, అందుకు ప్రతిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం కొరకు ఆమె తన బీజేపీ నేతలను పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ఒప్పించారనే వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఐ.పి.యల్. కుంభకోణంలో నిందితుడుగా పేర్కొనబడిన తరువాత దేశం విడిచిపెట్టి లండన్ కి పారిపోయిన లలిత్ మోడీకి సహాయపడినందుకు విమర్శలు మూట గట్టుకొంటున్నారు.
దేశం విడిచిపెట్టి పారిపోయిన ఒక నిందితుడికి ఆమె పోర్చుగల్ వెళ్లేందుకు వీసా ఇప్పించి తన పదవిని దుర్వినియోగం చేసారని, కనుక తక్షణమే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు గత రెండు వారాలుగా లోక్ సభను స్తంభింపజేయడంతో వారిని సభ నుండి ఐదు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసారు. ఈరోజు సభలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, “నేను బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడి లలిత్ మోడీకి వీసా ఇప్పించానని గత రెండు నెలలుగా మీడియాలో నాపై ఒక అసత్య ప్రచారం జరుగుతోంది. దానిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నన్ను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం చాలా శోచనీయం. అసలు లలిత్ మోడీకి వీసా ఇమ్మని నేను ఎన్నడూ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరలేదు, సిఫార్సు కూడా చేయలేదు. బ్రిటన్ ప్రభుత్వమే ఆయన భార్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలిసి, ఆయనకి వీసా మంజూరు చేసింది. ఆ విషయం బ్రిటన్ ప్రభుత్వమే స్వయంగా దృవీకరించింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నా రాజీనామాకు పట్టుబడుతోంది.”
“నేను లలిత్ మోడీకి వీసా ఇప్పించమని బ్రిటన్ ప్రభుత్వానికి వ్రాసినట్లు ఈ-మెయిల్స్ లేదా మరేవయినా రుజువులు ఉంటే వాటిని బయటపెట్టామని కాంగ్రెస్ పార్టీని నేను సవాలు చేస్తున్నాను. కాంగ్రెస్ అడిగే ప్రతీ ప్రశ్నకు నావద్ద సమాధానాలున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నా సమాధానం వినకుండా రాజీనామా కోరుతోంది. నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు నేనెందుకు రాజీనామా చేయాలి? నేను తప్పు చేసినట్లు కాంగ్రెస్ వద్ద ఆధారాలుంటే వాటిని బయటపెట్టి నిరూపించమనండి. నా తప్పుంటే ఎటువంటి శిక్షకయినా నేను సిద్దమే,” అని కాంగ్రెస్ పార్టీకి ఆమె సవాలు విసిరారు.
సుమారు రెండు నెలలుగా దీనిపై మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె స్వయంగా చెప్పుకొన్నారు. అదే విధంగా గత రెండు వారాలుగా పార్లమెంటులో ఇదే అంశంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కానీ ఏనాడు ఆమె ఇంత గట్టిగా తన నిర్దోషిత్వాన్ని సమర్ధించుకొంటూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది కూడా అనుమానం కలిగిస్తోంది. విదేశాంగ మంత్రి అయిన ఆమె బ్రిటన్ ప్రభుత్వం నుండి క్లీన్ సర్టిఫికేట్ సంపాదించుకొన్నాకనే ఇంత దైర్యంగా మాట్లాడుతున్నారా? లేక కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహానికి బీజేపీ రచించిన ప్రతివ్యూహంలో భాగంగానే ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నారా? తేలవలసి ఉంది.