గత రెండేళ్ళుగా తెదేపా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వివిధ సమస్యలపై అయన నిత్యం ధర్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన చేతిలో బలమైన సాక్షి మీడియా కూడా ఉండటంతో, అందులో తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, కధనాల వలన తెదేపాకి ఇంకా నష్టం జరుగుతోంది. తనపై నిరాధారమైన ప్రచారం చేస్తే సహించబోనని, ప్రజల సొమ్ముతో పెట్టిన సాక్షి మీడియాని ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని ముఖ్యమంత్రి పదేపదే చేస్తున్న హెచ్చరికలని జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో వివిధ కంపెనీలతో క్విడ్ ప్రో పద్దతిలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టినందుకు సిబిఐ ఆయనపై 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది కానీ వాటి వలన ఆయన కొంత ఇబ్బందిపడుతున్నారే తప్ప అవి ఆయన రాజకీయ జీవితంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అక్రమాస్తుల కేసులపై అధ్యయనం చేసేందుకు మంత్రులతో కూడిన ఒక కమిటీని నియమించింది. దాని సిఫార్సుల మేరకు ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, కొన్ని కంపెనీలకు గత ప్రభుత్వం కట్టబెట్టిన అనేక వందల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకొంది. జగన్మోహన్ రెడ్డితో సహా రాష్ట్రంలో అనేకమంది ప్రజా ప్రతినిధుల అక్రమాస్తులపై విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పడానికి గత ఏడాది ఒక చట్టాన్ని సిద్దం చేసింది. దానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న ఆమోదముద్ర వేశారు. కనుక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిపై చర్యలకు సిద్దం కావచ్చు.