రెండు మూడు వారాల క్రితం వరకు నిత్యం ఒకరో ఇద్దరో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతూనే ఉన్నారు. అకస్మాత్తుగా అవి ఆగిపోవడం చూస్తే తెదేపాపై జగన్ ప్రయోగించిన అస్త్ర శస్త్రాలన్నీ బాగానే పనిచేసినట్లు కనిపిస్తున్నాయి. వైకాపాలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు జోరందుకోగానే జగన్ డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను, జాతీయ పార్టీల నేతలను, జాతీయ మీడియా ప్రతినిధులని కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై చాలా అవినీతి ఆరోపణలు చేసారు. ఆ తరువాత తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరాహార దీక్ష చేశారు. అవసరమైతే గోదావరి జలాలపై తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తానని ప్రకటించారు. జగన్ వరుసగా అమలు చేసిన ఈ వ్యూహాల కారణంగా తెదేపా ప్రభుత్వం ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొందో అందరూ చూశారు. వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో తెదేపా మళ్ళీ ముందుకు వెళ్తే, మళ్ళీ దీక్షకు కూర్చొంటానని జగన్ చెప్పకనే చెప్పారు కనుక తెదేపా వెనక్కి తగ్గినట్లుంది. అంటే రెండు పార్టీల మద్య మ్యూకట్యువల్ అండర్ స్టాండింగ్ జరిగిందనుకోవాలేమో?అందుకే చాలా రోజులుగా వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగిపోయాయేమో?
వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులు నిలిచిపోవడంతో, రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి జరిగే ఎన్నికల విషయంలో కూడా స్పష్టత వచ్చినట్లే భావించవచ్చు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం తెదేపాకు మూడు, వైకాపా ఒక రాజ్యసభ సీటు దక్కాలి. కానీ వైకాపాకు ఆ అవకాశం ఇవ్వకుండా కనీసం 25-40 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కించుకోవాలని తెదేపా భావించింది. వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల జోరు చూసిన వారందరూ అదే జరుగబోతోందని భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారడంతో, తెదేపా నుంచి ముగ్గురు, వైకాపా నుంచి ఒక్కరు రాజ్యసభకి వెళ్ళడం దాదాపు ఖాయం అయినట్లే కనబడుతోంది. అదే జరిగితే ఇంక ఎన్నికల అవసరం ఉండకపోవచ్చు. తెదేపా తరపున ఎవరిని మళ్ళీ రాజ్యసభకి పంపిస్తారనే విషయంలో కొంచెం సందిగ్దత ఉన్నప్పటికీ వైకాపా నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి రాజ్యసభకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది.