తెదేపా సీనియర్ నేతల్లో పయ్యావుల కేశవ్ కూడా ఒకరు. వైకాపా ఎమ్మెల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహించి పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన వ్యతిరేకించడం విశేషం. నిన్న కల్యాణదుర్గంలో జరిగిన మినీ మహానాడులో పార్టీ నేతలని, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “బెల్లం చుట్టూ ఈగలు, చీమలు మూగినట్లే అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మూగుతుంటారు. కేవలం అధికారం కోసమే పార్టీలోకి వచ్చి చేరుతున్న అటువంటి వారి పట్ల అధిష్టానం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం,” అని అన్నారు. విశేషం ఏమిటంటే ఇటీవల వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా ఆ సమావేశంలో ఉన్నారు. పయ్యావుల మాటలకు ఆయన నొచ్చుకొని సమావేశం నుంచి అర్దాంతరంగా బయటకి వెళ్లిపోయారు. వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడంపై చూపిన శ్రద్ధ, వారు పార్టీలో చేరాక కనబడటం లేదని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. మినీ మహానాడు సమావేశాలలో పదిమంది ముందు వారిని ఈవిధంగా అవమానిస్తే వాళ్ళు మళ్ళీ వైకాపాలోకి వెళ్ళిపోకుండా ఉంటారా? ఈ పరిస్థితులను గమనించే బహుశః వైకాపా వారిని మళ్ళీ వెనక్కి రమ్మని ఆహ్వానిస్తోందేమో?