తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయిన సంగతి అందరికీ తెలుసు. అందుకు కారాకులు, కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అంటే రఘువీరా రెడ్డి ఒక్కరు మాత్రమేనని అనుకొంటునట్లుగానే, తెలంగాణాలో తెదేపా అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రముఖంగా కనిపిస్తుంటారు. తెలంగాణాలో తెదేపా మళ్ళీ బ్రతికి బట్ట కడుతుందనే నమ్మకం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేకపోయినా, రేవంత్ రెడ్డికి మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ఏమి చూసుకొని పార్టీకి మళ్ళీ పునర్వైభవం కలుగుతుందని చెపుతున్నారో తెలియదు కానీ వచ్చే ఎన్నికలలో కనీసం వివిధ వర్గాలకు చెందిన 100 మంది యువకులకు తెదేపా టికెట్లు ఇస్తామని నిన్న ప్రకటించారు. తనపై కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టి వేధించినప్పటికీ తను కేసీఆర్ ముందు తలవంచబోనని స్పష్టం చేసారు. తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ చెర నుంచి విడిపించేవరకు తన పోరాటం సాగుతుందని, అది తన పాదయాత్రతోనే మొదలుపెడుతున్నానని ప్రకటించారు. త్వరలోనే మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెదేపాయే తప్పకుండా గెలుస్తుందని, అందుకోసం మిగిలిన ఈ మూడేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఆయన మాటలు వింటే ఆయనకున్న నమ్మకం తెలంగాణాలో మరే తెదేపా నేతలకు కానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేకపోయాయే అని అనుకోకుండా ఉండలేము.