ప్రతి దుర్ఘటనలోనూ ప్రభుత్వం ఓవర్ ఏక్షన్
ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరిహారాలు చెల్లించేసి, అందుకు కారణాల్ని, కారకుల్నీ వదిలిపెట్టే ధరణి పెరిగిపోతోంది. అంతకు మించి ఇలాంటి సందర్భాల్లో మీడియా చేసే ప్రచారం, అందుకోసమే అన్నట్టు ప్రభుత్వం, మంత్రులు, అధికారులు చేసే హడావిడి దారుణానికి మూలాల్ని తెరవెనక్కి నెట్టేస్తున్నాయి.
గుంటూరులో భవనంకూలి ఏడుగురు మరణించిన సంఘటనలో సహాయక చర్యలను హోం మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూండటవల్ల ఆయన ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయన్న వార్తలు బాగా ప్రముఖంగా వచ్చాయి.”పోయినోళ్ళు ఎలాగు పోయారు కూలీల కుటుంబాలకు పదిహేనేసి లక్షల రూపాయల సెటిల్ మెంటు బాగానే వుందికదా” అని జనరల్ టాక్ వచ్చేసింది.
అయితే భద్రతా ఏర్పాట్లు లేకుండా నిర్మాణం చేస్తూ ఏడుగురి అకాల మరణాలకు బాధ్యుడైన భవన నిర్మాత మీద చర్యలు నీరుగారిపోతున్నాయి. బిల్డర్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తికావడంతో… అన్ని స్థాయిల్లో, అందర్నీ మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఘటన జరిగిన రోజు నిందితులను అరెస్టు చేస్తామని హడావుడి చేసిన పోలీసు అధికారులు… అరెస్టు చేయిస్తామని ప్రగల్బాలు పలికిన రాజకీయ నాయకులు ఇప్పుడే ఈ ఊసే ఎత్తకపోవడం పలు అనుమానాలను తావిస్తోంది.
చట్టం అమలు చేయాలన్న నిబద్ధత ప్రభుత్వాధినేతలకేలేదు. గోదావరి పుష్కరాల మొదటిరోజున తొక్కిసలాటలో 28 మంది మరణాలకు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. మృతుల కుటుంబాలకు భారీగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాలు చేశారు. న్యాయవిచారణ చేయించారు. విచారణలో ప్రభుత్వం అఫిడవిట్లు కూడా దాఖలు చేయలేదు. విచారణ గడువు ముగిసిపోయింది. కమీషన్ ను పొడిగిస్తారో గోదావరిలో కలిపేశారో తెలియదు.
కాల్ మనీ నేరస్ధులు ఎంతటి వారైనా వదిలేది లేదని ముఖ్యమంత్రే మూడునాలుగు సార్లు చెప్పారు. నిర్భయ చట్టంకింద వారిని శిక్షింపజేస్తామని ప్రజలను నమ్మించారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించారు. రుణాలు తీసుకున్నవారిలో కొందరు అప్పిచ్చిన వారిని బ్లాక్ మెయిల్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధించారు. నిజానిజాలు తెలిసిన అధికార యంత్రాంగం నిందితులను బెదిరించి జేబులు నింపుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన హడావిడి వల్ల ఇదంతా జరిగింది. సజావుగా డబ్బు చెల్లించే వారికి అప్పు పుట్టని వాతావరణం ఏర్పడింది.
ఇదంతా జరిగాక విజయవాడ కాల్ మనీ నేరస్ధులు బెయిలు మీద బయటికి వచ్చి తాము వేధించినవారి ముందు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. నిర్భయ కేసులు పెట్టివుంటే వారికి బెయిల్ రాదుకదా!
ఆగ్రహంతో వున్న బాధితులకంటే పెద్దపెద్ద రంకెలు వేసి వారి కోపాన్ని చల్లబరచేసి, నేరస్ధులు కాపాడే ధోరణికి ప్రభుత్వాధినేతలే పూనుకున్న పాపమే ఇది. ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా?
అనుకోని విపత్తు ఎదురైనపుడు నాయకులు చేసే హడావిడి చూస్తే ఇదంతా తప్పు చేసిన వాళ్ళను కాపాడటానికే అన్న భావన సామాన్యుల ఆలోచనల్లోకి వచ్చేస్తోందంటే ప్రభుత్వ చర్యలమీద నమ్మకంపోతున్నట్టే!
ఎవరిపనిని వారు చేసుకునే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తే సంబంధిత యంత్రాంగమే జవాబుదారీతనం వహిస్తుంది. ముఖ్యంగా నాయకులు బహుపాత్రాభినయం మాని ఎవరిపాత్రలో వారు జీవిస్తే కనీసం నటిస్తే మిగిలిన సిస్టమ్స్ బాగాపనిచేస్తాయి. గుంటూరు సంఘటనలో అరెస్టులు జరగకపోవడాన్ని గమనిస్తే అక్కడికి నాయకులు వెళ్ళింది న్యాయం చేయడానికా? బిల్డర్ల తరపున బాధిత కుటుంబాలకు సెటిల్మెంటు చేయడానికా అన్న అనుమానమే ఎదురౌతోంది!