యూపియే ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీయడానికి సిబిఐ, ఈడి,ఆదాయపన్ను శాఖలను ప్రయోగించేది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే పద్ధతులు అలవరుచుకొన్నట్లుంది.
ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ కి చెందిన అసోసియేషన్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) సంస్థకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ (ఇంటలిజన్స్) నోటీసు జారీ చేశారు. గత నాలుగేళ్లలో ఆ సంస్థ యొక్క ఆదాయ, వ్యయ వివరాలను, వాటికి చెల్లించిన పన్ను వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వగైరా అన్నీ తమకు అందజేయవలసిందిగా నోటీస్ లో కోరారు. సీఏజీలో మేనేజర్లుగా చేస్తున్నవారు స్వయంగా ఆ వివరాలను తీసుకొని తమ ముందు హాజరు కావాలని నోటీస్ లో పేర్కొన్నారు.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీఏజీ సంస్థ 2014 ఎన్నికలలో నరేంద్ర మోడీకి సేవలు అందించి ఆయన విజయానికి బాటలు పరిచింది. మళ్ళీ అదే సంస్థ ఆ తరువాత ఏడాది బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ కి సేవలు అందించి భాజపా పరాజయానికి కారణం అవడం విచిత్రమే. వరుస అపజయాలతో తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా సీఏజీ గొప్పదనాన్ని గుర్తించి, వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో సీఏజీ సేవలు ఉపయోగించుకోవాలని భావించింది. కొన్ని రోజుల క్రితమే దానితో ఒప్పందం కూడా చేసుకొంది.
కనుక ఇంతకు ముందు మోడీ విజయం కోసం పనిచేసిన సీఏజీ ఇప్పుడు కాంగ్రెస్ విజయం కోసం పనిచేయబోతోందన్న మాట! భాజపాకి ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. భాజపా ఒక్కదానికే కాదు కాంగ్రెస్, సమాజ్ వాదీ, బి.ఎస్.పి. వగైరా అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కూడా ఒడ్డున పడేయగల సత్తా సీఏజీకి ఉందా లేదా అనే విషయం పక్కనబెడితే, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడానికి అంగీకరించినందుకే సీఏజీకి నోటీసులు జారీ అయ్యాయేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే, రాజకీయ ప్రత్యర్ధులను వేధించడంలో కాంగ్రెస్ పార్టీకి, భాజపాకి పెద్ద తేడా ఏమీ లేదనే చెప్పుకోవలసి ఉంటుంది.