తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డి.ఎం.కె. పార్టీ శాసనసభ్యులు, తమ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి రెండవ కుమారుడు స్టాలిన్ని శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకొన్నారు. 93ఏళ్ల వయసున్న కరుణానిధి శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కనుకనే స్టాలిన్ని నాయకుడిగా ఎన్నుకొన్నారనే సంగతి పైకి చెప్పకపోయినా అది అందరికీ తెలుసు.
ఎన్నికలకు ముందు కరుణానిధి తనను తానే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించుకొన్నారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రని కూడా నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్న ఆయన, అంతకంటే చాలా శ్రమతో కూడిన ముఖ్యమంత్రి బాధ్యతలు ఏవిధంగా నిర్వర్తించాలనుకొన్నారో తెలియదు. బహుశః తన పార్టీ గెలిస్తే, అప్పుడు కూడా ఇదే విధంగా ఆరోగ్య కారణాలు చూపించి తన కొడుకు స్టాలిన్ కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని అనుకొన్నారేమో? కానీ వృదాప్యంతో బాధపడుతున్న కరుణానిధి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించుకోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం అయ్యుండవచ్చు. కరుణానిధి శాసనసభకి వచ్చే పరిస్థితులలో కూడా లేనప్పుడు ఆయనకి వేసిన ఓట్లు కూడా వృధా అయినట్లే భావించవలసి ఉంటుంది. అధికార దాహంతో అటువంటి నేతలు పోటీ చేస్తున్నప్పుడు, ప్రజలే మంచి చెడ్డలు ఆలోచించి అటువంటి వారిని తిరస్కరించి ఉంటే మళ్ళీ ఎన్నడూ ఎవరూ కూడా అటుఅవంటి ఆలోచన చేసేవారుకారు.
ఇప్పుడు కరుణానిధి తన స్థానంలో తన కొడుకు స్టాలిన్ కి శాసనసభ పక్ష నేత పదవిని కట్టబెట్టడంతో, ఇక ఆయనే డి.ఎం.కె.పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు దృవీకరించినట్లయింది. కనుక పెద్దవాడైన అళగిరి మళ్ళీ అలగడం, పార్టీని వీడటం లేదా పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యం లేదు.