ఈశాన్య రాష్ట్రాలలో తమ పార్టీ జెండా ఎగురవేయాలనే భాజపా కల ఇన్నాళ్ళకు నెరవేరింది. మొట్టమొదటి ప్రయత్నంలోనే భాజపా దాని మిత్ర పక్షాలతో కలిసి 126 సీట్లలో ఏకంగా 86 సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో అధికారం స్వంతం చేసుకొంది. వాటిలో భాజపాయే 60 సీట్లు గెలుచుకొని తన సత్తా చాటుకొంది.
అసోంలో మొట్టమొదటిసారిగా భాజపాని అధికారంలోకి రావడానికి కారకుడైన అసోం భాజపా సీనియర్ నేత సర్బానంద సోనోవాల్ ఇవ్వాళ్ళ గౌహాతీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో బాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో సహా పలువు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, లాల్ కృష్ణ అద్వానీ వంటి అనేకమంది భాజపా సీనియర్ నేతలు, ఎన్డీయే మిత్రపక్ష పార్టీల నేతలు హాజరవడంతో ఈ కార్యక్రమం ఊహించిన దానికంటే చాలా అట్టహాసంగా జరిగింది. గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాలు, నేతల మొహాలనే చూడటానికి అలవాటు పడిన అసోం ప్రజలకు ఈరోజు పూర్తిగా సరికొత్త వాతావరణం చూశారు.
సోనోవాల్ ప్రమాణస్వీకారంతో ఈశాన్య రాష్ట్రంలో భాజపా ప్రస్తానం మొదలైనట్లే చెప్పవచ్చు. అసోంలో భాజపా అధికారంలోకి వచ్చింది కనుక మెల్లగా మిగిలిన రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరించి బలోపేతం చేయడానికి గట్టిగా కృషి చేయవచ్చు. అయితే దక్షిణాది రాష్ట్రాలలో కూడా విస్తరించాలని భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ఈసారి ఎన్నికలలో తమిళనాడు, పుదుచ్చేరిలలో భాజపాకి ఒక్క సీటు కూడా రాలేదు. కానీ కేరళలో మొట్టమొదటిసారిగా ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. వచ్చే ఎన్నికల నాటికి కర్నాటకలో భాజపాని మళ్ళీ బలోపేతం చేసుకొని, అధికారం దక్కించుకోవడం కోసం అవినీతిపరుడు, అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్లివచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకే పార్టీ పగ్గాలు అప్పగించింది.
ఆంధ్రాలో తెదేపాతో పొత్తులు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగ తయారయ్యాయి. ఆంధ్రాలో తెదేపా, వైకాపాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా కలలు కంటున్నప్పటికీ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు వంటి హామీల అమలు విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటోంది కనుక భాజపా తనంతట తానుగా ఆంధ్రాలో అధికారం రావడం చాలా కష్టమే. తెలంగాణాలో కేసీఆర్, తెరాస ధాటిని తట్టుకొని నిలబడలేకపోతున్న భాజపా అక్కడా అధికారంలోకి రావడం అసాధ్యమే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవో కొన్ని సీట్లు దక్కించుకొని వాటితోనే బండి లాగించక తప్పేలా లేదు.