నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రెండో వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈనెల 28న శనివారం సాయంత్రం కలర్ ఫుల్ ఈవెంట్ కు సర్వం సిద్ధం చేస్తోంది. బాలీవుడ్ షహెన్ షా అమితాబ్ బచ్చన్ ఈ షో యాంకర్ గా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తదితరులు ఈ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
మోడీ ప్రభుత్వం రెండేళ్లలో అద్భుత విజయాలను సాధించిందనే సందేశాన్ని లోకానికి చాటాలని కేంద్రం నిర్ణయించింది. శనివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ఐదు గంటల మారథాన్ మెగా షో జరుగుతుంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ అతిరథ మహారథులు, ఎంపీలు, ఇతర నాయకులు ఈ ఈవెంట్ కు హాజరవుతారు.
ఈ సందర్భంగా కళ్లు మిరుమిట్లుగొలిపే ఏర్పాట్లుంటాయి. కలర్ ఫుల్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇండియా గేట్ వద్ద అతిపెద్ద వేదిక నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వంద మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. పలువురు బాలీవుడ్ తారలు కూడా తరలివచ్చే అవకాశం ఉంది.
ఇండియా గేట్ ఈవెంట్ లో రాజకీయ నాయకులు, గ్లామర్ తారలతో పాటు టెక్నాలజీని ఉపయోగించే ప్రజంటేషన్లు కూడా ఉంటాయి. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ఫలితాలపై ఆడియో వీడియో ప్రజంటేషన్ వగైరా ఎలాగూ ఉంటాయి.
మోడీ రెండేళ్ల పనితీరుపై భిన్నాభిప్రాయాలున్నాయి. చాలా అద్భుతంగా ఉందనే వారున్నారు. అంత గొప్పగా ఏమీ లేదనే వారూ ఉన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వంలో అవినీతి బాగా తగ్గిందని మాత్రం ఎక్కువ మంది ఒప్పుకుంటారు. ఇతర విషయాల్లో మోడీని తీవ్రంగా విమర్శించే వాళ్లలోనూ చాలా మంది ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఎవరు ఏమన్నా, తమ ప్రభుత్వం రెండేళ్లలో దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లిందని కమలనాథులు నమ్ముతున్నారు. అందుకే, ఇండియా గేట్ వద్ద కళ్లు మిరుమిట్లుగొలిపే గ్రాండ్ గాలా షో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.