ట్రిపుల్ తలాక్: ముస్లిం దేశాల్లో నిషిద్ధం, భారత్ కొనసాగుతున్న ఆచారం
భర్త కోసం ఎదురు చూస్తున్న యువతికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. దాన్ని విప్పి చూసింది. అందులో మూడే మూడు పదాలున్నాయి. తలాక్, తలాక్, తలాక్. అంతే. ఆమెకు విడాకులు ఇచ్చేసినట్టే అన్నాడు ఆ భర్త. జై పూర్ కు చెందిన ఆ యువతి ఈ హటాత్ పరిణామానికి షాకేంది. న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడీ కేసుల సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ మీడియాలో బలమైన డిమాండ్ వినిపిస్తోంది.
మూడుసార్లు భర్త తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్టే అనే విధానం అనాగరికమని పలువురు ముస్లిం మహిళలు ఆక్రోశిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ముస్లిం మతపెద్దలు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.
మన దేశంలో ముస్లింలకు పర్సనల్ లా అమల్లో ఉంది. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు ససేమిరా అంటోంది. మహిళల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనేక దేశాల్లో ఈ విధానాన్ని ఇప్పటికే నిషేధించారు. మన పొరుగు దేశం, ఇస్లామిక్ రాజ్యమైన పాకిస్తాన్ అప్పుడెప్పుడో 1961లో, అంటే 55 ఏళ్ల క్రితమే ఈ విధానాన్ని నిషేధించింది. మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ లోనూ ఈ విధానాన్ని దురుద్దేశంతో, ఇష్టం వచ్చినట్టు వాడటాన్ని నిషేధించారు. యు.ఎ.ఇ. సహా మొత్తం 22 ముస్లిం దేశాల్లో ఈ విధానాన్ని నిషేధించారు. సెక్యులర్ దేశమైన భారత్ లో మాత్రం ఇంకా అమల్లో ఉండటమే ఆశ్చర్యం.
ముస్లిం మతపెద్దల అంగీకారం లేకుండా ఈ పద్ధతిని మార్చడం సాధ్యం కాదనే వాదన ఉంది. సాక్షాత్తూ ముస్లిం దేశాల్లో నిషేధించిన ఈ ఛాందస విధానం మన దేశంలో అమలు చేయడం ఏమిటనే ప్రశ్నకు జవాబు లేదు. మైనారిటీలను బుజ్జగించడం అనే ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఇంకా ఈ అనాగరిక విధానం మన దేశంలో అమల్లో ఉంది.
ప్రభుత్వ పరంగాగానీ, న్యాయ వ్యవస్థ ద్వారా గానీ తమకు న్యాయం చేయాలంటున్నారు ముస్లిం మహిళలు. వారి డిమాండ్ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం.