తెలంగాణ ఉద్యమ సమయంలో హోరుగల్లుగా పేరుపొందన వరంగల్, స్మార్ట్ సిటీగా ప్రగతి పథంలో దూసుకుపోయే అవకాశం వచ్చింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఢిల్లీలో ప్రకటించిన రెండో విడత స్మార్ట్ సిటీస్ జాబితాలో కాకతీయ నగరి ఓరుగల్లుకు చోటు దక్కింది. మొదటి విడత 20 నగరాల్లోనే వరంగల్ ఉండాల్సింది. కానీ కొద్దిలో అవకాశం చేజారింది.
స్మార్ట్ సిటీస్ జాబితాలో చేరడం అంటే జాక్ పాట్ కొట్టడం లాంటిదే. ప్రతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం రూ. 500 కోట్ల గ్రాంట్ ఇస్తుంది. అంతే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. అంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయలతో నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. తొలివిడతలో ఏపీ నుంచి ఎంపికైన విశాఖ, కాకినాడలకు కనీసం వెయ్యికోట్ల చొప్పున అభివృద్ధి కోసం నిధులు సమకూరుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరంగల్ కు కూడా అదే తరహాలో నిధులు రావడం ఖాయం.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. ఒకప్పుడు కాకతీయ రాజుల రాజధాని. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గ్రేటర్ కార్పొరేషన్ గా ప్రకటించింది. కానీ గ్రేటర్ స్థాయిలో మౌలిక సదుపాయాలు మచ్చుకైనా లేవు. స్మార్ట్ సిటీ అయితే మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. రోడ్లు, డ్రయినేజీ వగైరా సదుపాయాలు కలుగుతాయి. ఉచిత వైఫై సహా సాంకేతికంగా ఎన్నో ప్రయోజనాలుంటాయి.
స్మార్ట్ సిటీస్ పరిపాలనలో హైటెక్ హంగులు సమకూరుతాయి. ఇ- పరిపాలన వ్యాప్తిలోకి వస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ అద్భుతంగా మెరుగుపడుతుంది. అంటే సిటీబస్సులు వగైరాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి.
సరైన ప్రణాళిక ఉంటే వరంగల్ ను నిజమైన గ్రేటర్ నగరంగా, నందన వనంలా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. నగర పౌరులకు మెరుగైన పౌర సేవలు, పెద్ద సంఖ్యలో పక్కా ఇళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.