ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావని, ఆ కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని వైకాపా అదినేత జగన్మోహన్ రెడ్డి తరచూ చెపుతుంటారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత తెలిసీ కూడా సి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దానిని సాధించడానికి గట్టిగా ప్రయత్నించడం లేదని జగన్ తరచూ ఆరోపిస్తుంటారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ డిల్లీ వెళ్లి ఒక్క రోజు ధర్నా చేశారు. ఒకరోజు రాష్ట్ర బంద్ నిర్వహించారు. దాని కోసం సుమారు వారం రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తరువాత మళ్ళీ దాని కోసం ఆయన పోరాడనప్పటికీ, ఆయనతో సహా వైకాపా నేతలు అందరూ ఆ ప్రస్తావన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం మరిచిపోరు.
ప్రత్యేక హోదా రాకపోవడం వలననే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని వైకాపా నేతలు వాదిస్తుంటే, దాని కోసం వారు చేస్తున్న ధర్నాలు, ఉద్యమాల కారణంగానే రాష్ట్రంలో అశాంత వాతావరణం ఏర్పడిందని, ఆ కారణంగానే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆరోపించడం విశేషం.
ప్రత్యేక హోదా సాధించాలనే ఆసక్తి ఆ రెండు పార్టీలకి లేదని చెప్పక తప్పదు. తెదేపాకు ఆ ఆసక్తి, పట్టుదల ఉండి ఉంటే, మిత్రపక్షమైన భాజపాపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకొనే ప్రయత్నాలు చేసి ఉండేది. కానీ హోదా రాదనే సంగతి ఏడాదిన్నర క్రితమే తెలిసి ఉన్నప్పటికీ తెలియనట్లు నటిస్తోంది. దానిపై ఇంకా ద్వంద వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది.
వైకాపాకి కూడా హోదా అంశం తెదేపాను, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఇరుకున పెట్టే గొప్ప అస్త్రంగానే భావిస్తోంది తప్ప నిజంగా హోదా సాధించాలనే తపన దానిలో కనబడదు. ఉండి ఉంటే జగన్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీయాలి కానీ ఆయన లెక్కలు, సమస్యలు ఆయనకీ ఉన్నాయి కనుక దానిపై ఆయన కేవలం చంద్రబాబు నాయుడినే నిలదీస్తుంటారు. విమర్శిస్తుంటారు.
కారణాలు ఏవయినప్పటికీ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని మంత్రి శిద్దా రాఘవరావు స్వయంగా దృవీకరించారు. అందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ మాత్రం బాధ పడకపోవడం చాలా శోచనీయం.