హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న వివిధ శాఖల అధిపతులు, ఉద్యోగులు జూన్ 27లోగా అమరావతికి తరలిరావాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 27 నుంచి వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తునందున, అధికారులు, ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఆ లోగానే అమరావతికి తరలి రావాలని సర్క్యులర్ లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం అమరావతి పరిసర ప్రాంతాలలో భవనాలను అద్దెకు తీసుకోవాలని అందుకు కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని సర్క్యులర్ లో పేర్కొంది.
జూన్ 27 నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తామని మంత్రులు నారాయణ తదితరులు చాలారోజులుగా చెపుతూనే ఉన్నారు. కనుక ప్రభుత్వమే రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలకు తగిన భవనాలను లీజుకి తీసుకొని, అక్కడికి వచ్చి పని మొదలుపెట్టమని ఆదేశించి ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వచ్చి విజయవాడ, గుంటూరు నగరాలలో ప్రభుత్వ కార్యాలయాలు వెతుక్కోమని సర్క్యులర్ లో సూచించి ఉంటే దానిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించడం తధ్యం. ఎందుకంటే కార్యాలయాలు ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వానిదే కానీ ఉద్యోగులది కాదు. వారు నివసించడానికి ఇళ్ళు వెతుక్కోవడానికే నానా కష్టాలు పడుతున్నారు. ఇంకా పనిచేయడానికి కార్యాలయాలు కూడా వెతుక్కొనే బాధ్యత వారి మీదే పెడితే వారు ఆగ్రహం చెందడం ఖాయం. అయినా కేవలం నెలరోజుల వ్యవధిలో ఇల్లు, కార్యాలయాలు వెతుక్కొని తరలిరావడం చాల కష్టమే. తాత్కాలిక సచివాలయంలో పనిచేయవలసిన ఉద్యోగులు, అధికారులు తరలిరావడానికి పెద్దగా ఇబ్బంది, అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ బయట ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమే.