కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాశారు. తన వెనుక జగన్ ఉన్నాడని తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను తక్షణమే ఉద్యమం నిలిపివేస్తానని లేకుంటే మీరు ఏమి చేస్తారో చెప్పాలని తన లేఖలో సవాలు చేశారు. తన రాజకీయ అనుభవంలో సగం వయసు కూడా లేని జగన్మోహన్ రెడ్డి సలహా, సహకారాలు తీసుకోవలసిన అవసరం తనకేమిటి? అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి కూడా కాపుల సంక్షేమం కోసమే పోరాడుతున్నాను తప్ప ఆ పేరుతో రాజకీయాలు చేయడం లేదని తన లేఖలో పేర్కొన్నారు. గతంలో కాపుల కోసం పోరాడేందుకు తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్నీ, అప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలని కూడా ముద్రగడ తన లేఖలో గుర్తు చేశారు. కాపుల కోసం ప్రభుత్వం ధనంతో కడుతున్న భవనాలకు చంద్రన్న భవనాలని పేరు పెట్టడాన్ని ముద్రగడ తన లేఖలో తప్పు పట్టారు.
ముద్రగడపై తెదేపా నేతలు అటువంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమే కానీ అందుకు ఆయనే అవకాశం కల్పించారని చెప్పకతప్పదు. ఇన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా ఉద్యమానికి దిగడం, ఆయనను వైకాపా నేతలు, సాక్షి మీడియా గట్టిగా సమర్ధించడం, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వైకాపా నేతలు ఉద్యమ సమయంలో ఆయనను కలిసామని అంగీకరించడం వంటివన్నీ అందుకు దోహదపడేవే. అయితే ఆయన ఉద్యమానికి ఒకవేళ జగన్ ప్రోత్సాహం, అండదండలు అందించి ఉండి ఉంటే అదేమీ నేరం కాదు కనుక అదే విషయం బహిరంగంగా చెప్పుకోవచ్చు. కానీ అలాగా చెప్పుకొంటే బిసిలు దూరం అవుతారని వైకాపా భయపడుతున్నందునే చెప్పుకోలేకపోతున్నారని తెదేపా నేతల వాదన.
ముద్రగడ ఒక ఆశయం కోసం పోరాడుతున్నప్పుడు అటువంటి విమర్శలు ఎదురవడం సర్వసాధారణ విషయమే. చాలా రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ ఆ సంగతి తెలియకపోదు. కానీ ఆయన సహనం కోల్పోయి ముఖ్యమంత్రికి ఈవిధంగా లేఖలు వ్రాస్తుండటం వలన అందరి దృష్టిలో ఆయనే పలుచనవుతారు. ముఖ్యమంత్రికి ఇటువంటి సవాళ్లు విసిరే బదులు, ఇచ్చిన హామీలను అమలుచేయమని ఒత్తిడి చేస్తూ లేఖ వ్రాసి ఉంటే అందరూ హర్షించేవారు. మద్దతు ఇచ్చేవారు.