తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రకటన ఈ జూన్2న జరిగిపోతుందని కెసిఆర్ ప్రభుత్వమే హడావుడి సృష్టించింది. టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పిన ప్రకారం లీకులు ఇచ్చింది. మ్యాపులతో సహా కథనాలు రావడానికి కారణమైంది. సహజంగానే మాకు జిల్లాలు కావాలంటే మమ్ముల్ను ఫలానా జిల్లాతో కలపొద్దనే వాదనలు ఆందోళనలు మొదలైనాయి. అదిలాబాద్, కరీనంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,ఖమ్మం(భద్రాచలం) వంటిచోట్ల ఇది మరింత విస్త్రత రూపం తీసుకుంది. ఇదంతా జరుగుతుందని ముందుగా వూహించబట్టే ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందనను అంచనా వేయడానికే ఈ కసరత్తు ప్రారంభించారు. కెసిఆర్ తొలి వ్యాఖ్యలు చేసినప్పుడే విభజనకు మార్గదర్శకాలు చెప్పి వుంటే బావుండేది. కాని మొదట లీకులు తర్వాత దాన్నే మాట్లాడ్డం ఆ తర్వాత వెనక్కు తగ్గడం చాలాసార్లు చూసిందే. అంతా అయ్యాక ఈ మల్లగుల్లాలకు బాధ్యత మీడియాది అనేస్తారు. లేదంటే ప్రతిపక్షాలపై మోపేస్తారు. జిల్లాల పునర్విభజనపై తగు అధ్యయనం లేకుండా హడావుడి పెరగడానికి కారకులు కెసిఆర్ తప్ప మరొకరు కాదు. మరెవరూ అంత సాహసనం చేసే ప్రశ్న కూడా లేదు. కాకుంటే బండి ముందు గుర్రం వెనక చందంగా హడావుడి సృష్టించి ఆపైన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ విజయదశిమి అంటే అక్టోబర్ వరకూ వాయిదా వేశారు.
తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం గనక ఎవరి ఆలోచనలూ ఆకాంక్షలూ వారికి వుంటాయి. అంతిమ నిర్ణయం తీసుకునేది ఎలాగూ ముఖ్యమంత్రే గనక వారి సలహాలు సూచనలు వినడం అవసరమే. కేవలం ప్రాథమిక ప్రాతిపదికను చేసి అభిప్రాయాలు తీసుకోవచ్చు. కాని దీనిపై ఎలాటి ముసాయిదా విడుదల చేసినా తేనెతుట్టె కదిలించినట్టేనని ఆయన భావిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం ప్రకటిస్తే స్పందనలు ఇంకా తీవ్రంగా వుండొచ్చు.
అసలు తక్షణ సమస్యలు వెన్నాడుతుంటే జిల్లాల విభజనను ముందుకు తేవడంలో రాజకీయాలు చాలా వున్నాయి. ఇలాటి సమస్యలు రగిలితే మిగిలినవి వెనక్కు పోతాయని పాలకులందరికీ బాగా తెలుసు. ఇక ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తామని చెప్పిన కెసిఆర్ అలాగాక మరెలానో ఎందుకు చేస్తారు? ఇతరులకు అయోమయం తమకు స్పష్గత వుంటేనే కదా ఆధిక్యత ఆధికారంలో వున్నందుకు సార్థకత! ఇప్పటికే సర్వాదికారాలు కేంద్రీకరణ అయిన స్థితిలో జిల్లాలు చిన్నవై పోతే స్థానిక నాయకులు కొత్తగా ఎదిగే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.పునర్విభజన రాజకీయ నాయకులు చెప్పే ప్రకారం చేయబోమని కెసిఆర్ అనొచ్చు గాని కేవలం టిఆర్‌ఎస్ దృష్టితో చేస్తే ఇతరులు కూడా మౌనంగా వుండరు. పాలనా సౌలభ్యం కోసం శాస్త్రీయంగా కొలబద్దలు పెట్టుకుంటే అప్పుడు దర్జగా వాటినే ముందుగా ప్రకటించవచ్చు. ఏదో ముసాయిదా విడుదల చేసినంత మాత్రాన చిచ్చు రగులుతుందనుకోవడం ఎందుకు? టిఆర్‌ఎస్ మాత్రమే బాధ్యతగా ఆలోచిస్తుందనీ,మిగిలిన వారంతా రాజకీయాలే చేస్తారని ఎందుకనుకోవాలి? ఆ మాటకొస్తే టిఆర్‌ఎస్ వారిలోనూ అసంతృప్తి లేదా? వరుస ఎన్నికల విజయాలు వచ్చినంత మాత్రాన అందరూ మా నిర్ణయాన్నే శిరోధార్యంగా భావించాలని చెప్పడం ప్రజాస్వామ్యంలో చెల్లదు. జిల్లాల విభజన విషయంలో తొందరపాటుగా ఏదైనా చేస్తే అది టిఆర్‌ఎస్ కోరి రాజకీయ ప్రతికూలత తెచ్చుకోవడానికి కూడా దారితీయొచ్చు. ఇప్పుడు దసరా ముహూర్తం నాటికైనా సమయం సరిపోతుందో లేదో తెలియదు. ఈ లోగా విడివిడిగానైనా ప్రతిపక్షాలతో వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజాసంఘాలు పాలనా నిపుణులు సాధారణ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం చాలా మంచిది.