తమిళనాడు ముఖ్యమంత్రి పురుచ్చి తలైవి జయలలిత . నిరంకుశాధికారం, అవినీతి ఆరోపణలు, తీర్పులు శిక్షలూ ఎలా వున్నా మాట్లాడ్డం మాత్రం చాలా స్పష్టంగా వుంటుంది. ఇంగ్లీషు ఆధునికంగానూ వుంటుంది. విషయం మాత్రం మహా కక్ష పూరితంగానేవుంటుంది. ఇటీవలి ఘన విజయం తర్వాత ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైన డిఎంకె నాయకుడు స్టాలిన్‌కు వెనకవరసలో సీటు వేశారు. దాదాపు వందస్థానాలు కలిగిన ప్రతిపక్ష నేతను అలా తక్కువ చేయడం పెద్ద పొరబాటు. ఇది తమను అవమానించడమేనని ఆయన తండ్రి కరుణానిధి మండిపడ్డారు. జయలలిత మారే మనిషి కాదని తేల్చిచెప్పారు.
విచిత్రమేమంటే జయలలిత ఈ సీటింగు రగడపై విచారం వెలిబుచ్చారు! అయితే ఆ సంగతి తెలిసివుంటే ముందే సీటు వేయించేదాన్నని అధికారులు ప్రొటోకోల్ ప్రకారం చేసి వుంటారని అన్నారు. తమాషా ఏమంటే ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే 2002లోనూ ఇదే సన్నివేశం .. ఆప్పుడు డిఎంకె ప్రతిపక్ష నేత అంబుజగన్కు ఇలాగే జరిగింది. అమ్మ ఖచ్చితంగా ఇదే మాట్లాడారు. తెలిస్తే ముందు సీటు కేటాయించమని చెప్పేదాన్ని అన్నారు. అంతటితో ఆగక ఈ ప్రొటోకోల్ నిబంధనలు మార్చింది 1996లో డిఎంకె హయాంలోనేనని గుర్తు చేశారు. 2004 తర్వాత కరుణానిధిని ఇంట్లో అరెస్టు చేయడం, ఆయన చొక్కా కూడా లేకుండా హడావుడి చేయడం పెద్ద రాజకీయ వినోద కాలక్షేపమైంది కదా! ఎంతైనా తమిళనాడు నేతల స్టెయిలే వేరు.