ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ “రాష్ట్రంలో దేవాలయాల ఆదాయం 27 శాతం పెరిగింది. అదే సమయంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ప్రజలు దేవాలయాలకు వచ్చి హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారంటే పాపభీతితోనే. అందుకే ఆలయాల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు చాలా మంది 40 రోజుల పాటు అయ్యప్పమాల వేసుకొంటున్నారు. ఆ దీక్షా సమయంలో మద్యం ముట్టరు కనుక మద్యం ఆదాయం తగ్గిపోతోంది. ప్రజలలో పాపభీతి పెరుగుతోందని పెరుగుతున్న ఆలయాల ఆదాయం, తరుగుతున్న మద్యం ఆదాయం తెలుపుతున్నట్లుంది,” అని అన్నారు.
ముఖ్యమంత్రి ఆ మాటలను ఏదో సరదాగా అన్నప్పటికీ, మద్యంపై ప్రభుత్వ ఆదాయం తగ్గినందుకు ఆయన బాధపడుతున్నారనే భావన కలిగిస్తోంది. ప్రజలకు పాపభీతి పెరిగిన మాట వాస్తవం. ఆ కారణంగా ఆలయాల ఆదాయం పెరిగిన మాటా కూడా వాస్తవమే కావచ్చు. కానీ సున్నితమైన అటువంటి విషయాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఆలయాలకు వచ్చిన వాళ్ళు అందరూ పాపభీతితోనే రారు. చాలా మంది దేవునిపై భక్తి, విశ్వాసాలతోనే వస్తుంటారు. ఆ భక్తితోనే యధాశక్తిన హుండీలో కానుకలు వేస్తుంటారు. స్వామీజీలు, బాబాలు చెప్పే ప్రవచనాలు వినడానికి చాలా మంది ప్రజలు వెళుతుంటారు. వారు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తితోనే వెళతారు తప్ప తమ పాపాల లెక్కలు సరిచేసుకోవడానికి కాదు. కనుక దేవాలయాలు, మశీదులు, చర్చ్ లకు వెళ్ళే వారందరినీ పాపాత్ములుగా, వారు వేసే సొమ్ముని పాపపరిహారంగా భావించడం సరికాదు.