ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ మద్యన చాలా మంది నుంచి లేఖలు అందుకొంటున్నారు. కొన్ని వారల క్రితం జగన్మోహన్ రెడ్డి నుంచి లేఖ అందుకొన్నారు. ఆ తరువాత మొన్న కొణతాల రామకృష్ణ నుంచి మళ్ళీ నిన్న ముద్రగడ పద్మనాభం నుంచి ఇవ్వాళ్ళ కెవిపి రామచంద్ర రావు దగ్గర నుంచి వరుసగా లేఖలు అందుకొన్నారు.
కెవిపి వ్రాసిన లేఖలో ముఖ్యమంత్రికి ఒక సూచన చేశారు. ఈనెల 27 నుండి తిరుపతిలో జరిగే పార్టీ మహానాడు సమావేశాలలో భాజపాతో పొత్తులు కొనసాగించడమా వద్దా అనే విషయంపై చర్చించడం కాకుండా, ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానం చేయాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా అంశంపై ఒకరినొకరు విమర్శించుకొంటూ కాలక్షేపం చేయడం వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందే తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు కనుక రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి మోడీ ప్రభుత్వంతో పోరాడితే బాగుంటుందని, అందుకు చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని కోరారు. అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ పధకం రూపొందించుకోవడం మంచిదని కెవిపి తన లేఖలో సూచించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయకుండా, హోదా వలన ఉపయోగమేమీ లేదని ముఖ్యమంత్రి చెప్పడం తగదని కెవిపి హితవు పలికారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా కోసం తను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు ఓటింగ్ కి రాబోతోందని కనుక దానిని గెలిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా తనవంతు కృషి చేసి, సహకారం అందించాలని తన లేఖలో కోరారు.
కెవిపి సదుద్దేశ్యంతోనే ఆ లేఖ వ్రాసి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని తెదేపా వాదిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కెవిపి సూచనలను చంద్రబాబు నాయుడు మన్నిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. తెదేపాయే కాదు వైకాపా కూడా హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో చేతులు కలపడానికి సిద్ధంగా లేదు. ఎవరి ఉద్యమాలు..క్రెడిట్ లెక్కలు వారివే. ప్రత్యేక హోదా రానంత వరకే అన్ని పార్టీలు ఒకదానినొకటి నిందించుకోగలవు..విమర్శించుకోగలవు..తెదేపా కూడా వాటికి అతీతం కాదు. కనుక కెవిపి లేఖకు బదులుగా ఘాటయిన విమర్శలు వినిపిస్తుందేమో?