ఆగస్టు 12 న ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో – గోదావరి పుష్కరాల సీన్ రిపీట్ అవుతుందా? పనుల్లో ఆలస్యం గురించి అధికారుల మీద ముఖ్యమంత్రి విరుచుకు పడటాన్ని గమనిస్తే అదే సీన్ రిపీట్ కాక తప్పదనిపిస్తోంది.
కృష్ణా పుష్కరాలకు రూ.1251 కోట్లతో 1495 పనులు చేపట్టనున్నట్లు శాఖలవారీగా పనులను క్రోడీకరించి జిల్లా కలెక్టర్ వివరించారు. వీటిలో విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి 13 ప్యాకేజీల ద్వారా చేయించాల్సిన రోడ్లు, కల్వర్ట్లు, పనుల వంటివి ఎన్నెన్నో వున్నాయి. శాఖలవారీగా ఏఏపనులు ఎక్కడెక్కడ చేయిస్తామో శాఖలవారీగా మంత్రులు మీడియా సమావేశాల్లో ఊదరగొట్టేస్తున్నారు. విజయవాడ అంటే మరో నగరవాసులకు అసూయ కలిగించేటంత అభివృద్ధి ప్రచారం జరిగిపోతోంది.
కృష్ణా పుష్కరాలకు రెండున్నర నెలల వ్యవధి మాత్రమే వుంది. ఈపాటికే పనులు సగమైనా పూర్తి కావలసి వుంది. అయితే ఏ ప్రధానమైన పనికీ టెండర్ల ఫైనలైజేషనే ఇంకా జరగలేదు.
గత ఏడాది గోదావరి పుష్కరాల్లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. సమయం తరుముకువస్తున్నా పనులు ప్రారంభం కాలేదని ముఖ్యమంత్రి విరుచుకు పడటం, ఎవరూ టెండర్లే వేయకపోతే ఏంచేయగలమని అధికారులు సణుక్కోవడం, చివరి నిమిషంలో ఎస్టిమేట్లు పెంచి, నామినేషన్ ద్వారా వర్క్ ఆర్డర్లు ఇవ్వడం, క్వాలిటీని పక్కన పడేసి రాత్రికి రాత్రే పనులు పూర్తి చేయడం, వాన పడుతున్న సమయంలోనే బిటి రోడ్లు వేయడం, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్లాక్టర్లు దిగమింగడం, గోదావరి పుష్కరాల్లో జరిగింది.
ఇది అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైచేసిన దోపిడి కాదు. అధికారపార్టీ మద్దతుదారులకు బాగా కావలసిన కాంట్రాక్టర్లే సిండికేటై, రింగ్ ఏర్పడి టెండర్లే వేయకుండా నామినేషన్ మీద తమకే పనులు వచ్చేలా చూసుకున్న మాయాజాలం. దీని వెనుక అధికారపార్టీ ప్రభావం, పలుకుబడి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదేసీన్ కృష్ణా పుష్కరాల్లో కూడా రిపీటవ్వడం ఇప్పటికే మొదలైంది. ఏప్రధాన పనికీ టెండర్లు పడకపోవడం ఇందుకు ఒక సాక్ష్యం! గోదావరి పుష్కరాల్లో ఏమి జరిగిందో ఆయనకు స్వయంగా తెలుసు. కృష్ణాపుష్కరాల ఏర్పాట్లలో టెండర్లే పడని పరిస్ధితి ని బట్టయినా ఏం జరగబోతోందో ఆయనకు తెలిసే వుండాలి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా అధికారుల మీద విరుచుకు పడటం వల్ల చంద్రబాబు ఎవరినీ వొదలరు అనే ప్రచారం రావచ్చు గానీ, పనులు ఆఖరినిమిషం వరకూ సాగి ప్రజాధనం వృధా అయిపోతుంది.