2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెదేపా, భాజపాల తరపున ప్రచారం చేశారు. ఆ రెండూ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే ప్రజల తరపున తనే వాటిని ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నేతలే ఆయనని ప్రశ్నిస్తున్నారు.
వైకాపా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తెదేపా, భాజపాల తరపున హామీ ఇస్తూ ప్రచారం చేశారు కనుక ఆయనకీ బాధ్యత ఉంటుంది. రెండేళ్ళు పూర్తయినా తెదేపా, భాజపా ప్రభుత్వాలు తమ హాఆమీలని నిలబెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలిచేందుకు పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకి రూ.2000 నిరుద్యోగ భృతి వగైరా చాలా హామీలు ఇచ్చారు. కానీ అయన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయన తరపున ప్రజలకు హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా కనబడటం లేదు. ఏడాదికో..ఆర్నెల్లకో ఓసారి కనిపించి మాయమవుతుంటారు తప్ప ప్రజల తరపున నిలబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించరు. ఆయన మాటలను నమ్మి కాపు యువత అంతా తెదేపాకే ఓటేసి గెలిపిస్తే, వారిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మోసం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చారో? పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరించారో? ఏమి చేయాలనుకొంటున్నారో తెలియదు. ఓసారి రాజకీయాలలోకి వస్తానంటారు. మరోసారి పార్టీని నడిపించడానికి తన దగ్గిర డబ్బులు లేవంటారు. రాజకీయాలలో ఇంత అయోమయం ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీని నడిపించడానికి డబ్బు లేకపోయినా, తెదేపా, భాజపాలను ప్రజల తరపున నిలదీయడానికి డబ్బులు అవసరం లేదు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఆయన స్వయంగా పోరాటం చేయలేకపోయినా, దాని కోసం పోరాడుతున్న వారికి తన మద్దతు ప్రకటించడానికీ డబ్బులు అవసరం లేదు. ఆయన దేశ సమస్యలన్నిటి గురించి మోడీ ప్రభుత్వాన్ని నిలదీయనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే చాలు. కానీ ఆయన అదీ చేయకపోవడానికి తీరిక లేకపోవడమే కారణం అంటే నమ్మలేము. జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఆయనలో కనబడిన ఉత్సాహం, రాజకీయాలపై ఆసక్తి, సమాజానికి ఏదో చేయాలనే తపన, ఎవరినైనా నిలదీయగల తెగువ, ధైర్య సాహసాలు వంటివన్నీ రాజకీయాలలో డక్కామొక్కీలు తింటున్న కొద్దీ క్రమంగా తగ్గిపోవడం చేతనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారేమో?ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందిస్తే బాగుంటుంది. ఒకసారి ప్రజల నమ్మకం పోగొట్టుకొన్నాక ఆయన 2019 ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినా, అప్పుడు ఆయన మాటలను ఎవరూ నమ్మకపోవచ్చు.