ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయింది. ఆర్టీసీ వంటి సంస్థలు కూడా వేరు పడ్డాయి కానీ నేటికీ హైకోర్టు విభజన కాలేదు. రెండేళ్ళుగా రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగుతూనే ఉంది. మరో మూడేళ్ళు ఉమ్మడిగానే సాగినా ఆశ్చర్యమేమీ లేదు. విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హైకోర్టు తెలంగాణాకే చెందుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే హైకోర్టుని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కానీ దాని ఏర్పాటుని రాజధాని అమరావతి నిర్మాణంతో ముడిపెట్టడం వలన అది ఎప్పటికి సిద్దం అవుతుందో ఎవరికీ తెలియదు. కనుక హైదరాబాద్ లో వేరేగా ఆంధ్రా లేదా తెలంగాణా హైకోర్టు ఏర్పాటు చేసుకొందామంటే విభజన చట్టం ఒప్పుకోదు. ఏర్పాటు చేసుకోవాలంటే ఆ చట్టాన్ని సవరించాల్సిందే. ఈ విషయంలో కేంద్రానికి ఆసక్తి, చిత్తశుద్ధి ఉంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండేది. కానీ దాని లెక్కలు, సమస్యలు దానికీ ఉన్నాయి కనుక ఇంతవరకు అటువంటి ఆలోచన చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది కనుక రాజధానిలో ముందుగా హైకోర్టు భవనం నిర్మించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే చోట ఎక్కడైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోమని కోరవచ్చు. కానీ “అలాగ కోరలేము కదా?” అని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పగలుగుతున్నప్పుడు, తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేసుకోమని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మిత్ర ధర్మం కోసం కావచ్చు లేదా ఇంకేదయినా కారణాలు ఉండి ఉండవచ్చు.
ఈ సమస్యకి రెండే పరిష్కారాలు కనిపిస్తున్నాయి. 1. తక్షణమే యుద్ధప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించడం. 2. విభజన చట్టాన్ని సవరణ చేయడం. కేంద్రం గట్టిగా తలుచుకొంటే రెండూ సాధ్యమే. కానీ తలుచుకోదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించదు. కనుక హైకోర్టు విభజన కూడా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఏపి ప్రభుత్వాల తీరు ఈవిధంగా ఉన్నప్పుడు అది ఇంకా ఎప్పటికి సాధ్యమో చెప్పడం కూడా కష్టమే.