విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సంతృప్తి చెందినప్పుడే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు లెక్క. అందుకోసం పాలనలో పారదర్శకత, వేగం, నూతన ఒరవడి, చిత్తశుద్ధి అవసరం. మన రాష్ట్రంలో సహజ వనరులు ఉన్నా నాయకత్వ లోపం వలన వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాము. ఈవిషయంలో మనకంటే పొరుగు రాష్ట్రం చాలా బాగా పనిచేస్తోంది. మనం గట్టిగా కృషి చేస్తే అభివృద్ధి సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 13జిల్లాలు, వాటిలో మండలాల అవసరాలు, వాటిలో ఉన్న వనరులను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాము. ఆ ప్రకారం క్రింద స్థాయి నుంచి కలెక్టర్ వరకు అందరూ సమిష్టి కృషి చేస్తే వేగంగా అభివృద్ధి సాధించవచ్చు,” అని చంద్రబాబు అన్నారు.
ఆయన ఇంకా విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, మౌలికవసతుల కల్పన వంటి విషయాల గురించి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి చెపుతున్నట్లుగా క్రింద స్థాయి నుంచి పైవరకు కూడా సమిష్టి కృషి చేస్తే తప్పకుండా సత్ఫలితాలు సాదించవచ్చు. కానీ నాయకత్వ లోపం వలన ఆశించినంతగా అభివృద్ధి జరగడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో జిల్లా స్థాయి నుంచి అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. అంటే అక్కడ నాయకత్వ లోపం లేదని స్పష్టం అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ మార్గదర్శనం చేసి ముందుకు నడిపించవలసిన వ్యక్తి ముఖ్యమంత్రే. అంటే ఆయనే నాయకుడన్న మాట. కనుక చంద్రబాబు నాయుడు ముందుగా తన మంత్రుల పనితీరుని అంచనా వేసుకొని వారిలో అసమర్ధులను నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టడం చాలా అవసరం. సమర్ధులైన మంత్రులు ఉంటే ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు కూడా మెరుగుపడుతుంది. నేటికీ చాలా మంది మంత్రులు అసలు ఏమి చేస్తున్నారో..ఏమైనా చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకి చాలా మంది మంత్రుల పేర్లు కూడా తెలియదంటే వారి పనితీరు ఏవిధంగా ఉందో అర్ధమవుతుంది. అటువంటి మంత్రులతో ప్రజలలో 80 శాతం సంతృప్తి చెందేలా పాలన సాగించడం సాధ్యమేనా? కాదనుకొంటే ఏమి చేయాలో ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలి. సమావేశాలలో మాటలు, చర్చలు, నిర్ణయాలు అన్నీ ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఫలితాలు కనబడతాయి.