తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత తిరుగులేని నాయకుడిగాగుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తి ఎవరంటే మంత్రి కె.తారక రామారావు అని చెప్పవచ్చు. అటు రాజకీయాలలోను, ఇటు ప్రభుత్వంలో మంత్రిగాను ఆయన మంచి సమర్ధుడని పేరు తెచ్చుకొన్నారు. అధికార పార్టీలో కొందరు నేతలకి ఒకేసారి రెండు మూడు మంత్రిత్వ శాఖలు దక్కించుకోవడం సర్వసాదారణమైన విషయమే కానీ వాటిని అన్నటినీ సమర్ధంగా నిర్వహించగలగడం అందరికీ సాధ్యం కాదు. కానీ కేటీఆర్ ఐ.టి., పరిశ్రమలు, మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖలను చాల సమర్ధంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న కేటీఆర్, ఆ ప్రయత్నంలో భాగంగానే పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికా వచ్చినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా అధికారులతో, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ తెలుగు360కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు:
తెలుగు360: యాపిల్ మ్యాప్స్ సంస్థని హైదరాబాద్ కి రప్పించినందుకు అభినందనలు. చివరి నిమిషం వరకు ఈ యాపిల్ గురించి అంత రహస్యంగా ఎందుకు ఉంచారు?
కేటీఆర్: అవును. యాపిల్ మ్యాప్స్ ని హైదరాబాద్ రప్పించడానికి గురించి చాలా కాలంగా మేము కృషి చేస్తున్నాము. సాధారణంగా యాపిల్ సంస్థ ఏదైనా ప్రాజెక్టు మొదలుపెడితే దానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యేవరకు చాలా గోప్యత పాటిస్తుంటుందని అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు పనులు పూర్తవగానే దాని గురించి అకస్మాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇది కూడా అంతే. దీని కోసం మేము చాలా కాలంగా యాపిల్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాము. చివరికి మా ప్రయత్నాలు ఫలించి యాపిల్ అందుకోగాలిగాము. మా ప్రయత్నాలు విజయవంతం అయ్యాయంటే అందుకు కారణం మా ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలే. యాపిల్ సంస్థ ప్రతినిధులతో సమావేశాలకు ఆయన చాలా సహకరించారు. ఆయన సహాయసహకారాలు, పట్టుదల, కృషి వలననే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన యాపిల్, గూగుల్, ఫేస్ బుక్,అమజాన్ వంటి సంస్థలు వచ్చాయని మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. రెండేళ్ళ వ్యవధిలోనే జరిగిన ఈ అభివృద్ధిని చూసి నాకు నిజంగా చాలా సంతోషం కలుగుతోంది.
తెలుగు360: అవును. హైదరాబాద్ లో అటువంటి గొప్ప సంస్థలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయమే. అందుకు అభినందనలు. అయితే హైదరాబాద్ ఐటి సంస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ముఖ్యమైన సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులన్నీ బెంగుళూరులో సంస్థలకే ఎందుకు వెళ్లిపోతున్నాయి? హైదరాబాద్ సంస్థల సేవలను కేవలం బ్యాక్ ఆఫీస్ పనులకు మాత్రమే వినియోగించుకొంటున్నాయని పిర్యాదు ఉంది. దానిని ఏవిధంగా మీరు ఏవిధంగా పరిష్కరిస్తారు?
కేటీఆర్: అవును మీరు చెపుతున్న సమస్యని మేము గుర్తించాము. హైదరాబాద్ కంటే బెంగళూరు సాంకేతికంగా 10 ఏళ్ళు ముందుంది. అక్కడ అటువంటి పనులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వాతావరణం అన్నీ ఉన్నాయి. అందుకే మేజర్ ప్రాజెక్టులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అందుకే మా ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో అటువంటి సౌకర్యాలు, వాతావరణం కల్పించేందుకు టీ-హబ్, గేమింగ్ అండ్ యానిమేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటి వలన క్రమంగా హైదరాబాద్ కూడా బెంగళూరు స్థాయికి చేరుకొంటుందని ఆశిస్తున్నాము.
తెలుగు360: గత ఏడాది మీ అమెరికా పర్యటనతో పోలిస్తే ఈసారి తేడా ఏమిటి?
కేటీఆర్: గత ఏడాది వచ్చినప్పుడు నేను ముఖ్యంగా ఐటి తదితర సాంకేతిక రంగాలలో పెట్టుబడులు ఆకర్షించడానికి వచ్చాను. కానీ ఈసారి వివిధ రకాల పరిశ్రమలను సాధించడానికి వచ్చేను. ఫుడ్ ప్రాసెసింగ్ లో మంచి పేరున్న డేస్ మోయిన్స్ , ఓవా వంటి సంస్థల ప్రతినిధులతో ప్రస్తుతం నేను చర్చలు జరుపుతున్నాను. ఈ పర్యటనలో అమెరికా ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ మనదేశంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని, ముఖ్యంగా తెలంగాణాలో అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలలో అత్యుత్తమ విధానాలను తెలంగాణాలో కూడా అమలుచేసి సత్ఫలితాలు సాధించాలని నా కోరిక. అందుకే అమెరికాలో వివిధ నగరాలలో అత్యుత్తమ సంస్థలు, ప్రభుత్వ అధికారులను కలుస్తున్నాను. వారి సహాయ సహకారాలతో తెలంగాణాలో పారదర్శకమైన, వేగవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సామాన్య పౌరులు కూడా చాలా సుఖంగా జీవించేలా చేయాలనే నా కోరిక.
తెలుగు360: గత కొన్ని నెలలుగా అమెరికా వస్తున్న తెలుగు విద్యార్ధులు ఇక్కడ విమానాశ్రయాలలో అమెరికా అధికారుల వేధింపులకి గురవుతున్నారు. వారి సమస్యల పరిష్కారానికి మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా?
కేటీఆర్: అవి మా దృష్టికి కూడా వచ్చాయి. రోజూ కొన్ని వందల మంది తెలుగువాళ్ళు అమెరికాకి వస్తుంటారు. వారిలో ఏ కొద్దిమందికో అటువంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి సమస్యలు తలెత్తినప్పుడు మా ప్రభుత్వం తక్షణమే హైదరాబాద్ లో ఉన్న అమెరికన్ కౌన్సిలేట్ అధికారులతో, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో నేరుగా మాట్లాడి సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అమెరికా కౌన్సిల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ ప్రస్తుతం నా పక్కనే కూర్చొని ఉన్నారు. ఇటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా ఆయన మాకు చాలా సహకరిస్తుంటారు. మీకు అమెరికాలోని ఏదైయిన నిర్దిష్ట యూనివర్సిటీ లేదా ఇటువంటి సమస్యలపై సందేహాలు ఉన్నట్లయితే, దాని కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “యుఎస్ అండ్ హైదరాబాద్” అనే వెబ్ సైట్ కి వ్రాసి మీ సందేహాలు అన్నీ తీర్చుకోవచ్చు.
తెలుగు360: మీరు గతంలో చాలా కలం పాటు అమెరికాలో పని చేశారు. ఇక్కడ వారానికి 5 రోజులు పని, 2 రోజులు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. కానీ ఇప్పుడు మీరు అసలు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నారు. అమెరికా వదిలి వెళ్ళినందుకు ఎప్పుడైనా మీరు బాధ పడ్డారా?
కేటీఆర్: లేదు. ఎప్పుడూ లేదు.నిజం చెప్పాలంటే ఇక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే నేను భారత్ తిరిగి వెళ్ళిపోయి, నా దేశం నా రాష్ట్రం కోసం పని చేయాలనుకొనేవాడిని. అప్పటికే నాకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉండేవి. అందుకే నేను ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా కష్టమనిపించదు. పైగా నా కళ్ళ ముందే నా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం కోసం ఎంతైనా శ్రమ పడవచ్చుననిపిస్తుంది. ప్రవాస భారతీయులందరూ కూడా భారత్ అభివృద్ధిలో పాలు పంచుకొంటే బాగుంటుందని నా అభిప్రాయం.
తెలుగు360: విదేశాలలో స్థిరపడిన తరువాత, అక్కడ సుఖవంతమైన జీవితం గడపడానికే ఆడవాళ్ళు సాధారణంగా మొగ్గు చూపుతుంటారు. మీరు భారత్ తిరిగి వెళ్లిపోవాలనుకొన్నప్పుడు మీ అర్ధాంగి నుంచి కూడా అటుఅవంటి అభ్యంతఃరాలు ఏమైనా వచ్చాయా?
కేటీఆర్: లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచే మన లక్ష్యం ఏమిటో..మనం ఇక్కడ ఎంత కాలం ఉండబోతున్నామో నేను నా భార్యకు చెపుతుండేవాడిని. కనుక ఆమె భారత్ తిరిగి వెళ్లిపోవడానికి ఆమె కూడా సిద్దంగానే ఉండటంతో ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటే ఎటువంటి సమస్యలు రావు.
తెలుగు360: అమెరికా అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికవుతారని మీరు భావిస్తున్నారు?
కేటీఆర్: ఆ విషయంపై నాకు ఎటువంటి అభిప్రాయమూ లేదు. కానీ భారత్ కి అనుకూలంగా ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని కోరుకొంటున్నాను, అని ఇంటర్వూ ముగించారు.