తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డిఎంకె అధినేత కరుణానిధి హ్యాండ్ ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, డిఎంకెలు పొత్తులు పెట్టుకొని కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు పంచిఇచ్చినందునే డిఎంకె పార్టీ విజయం చేజార్చుకొంది. ఒకవేళ దానితో పొత్తులు పెట్టుకోకుండా అన్ని స్థానాలకు పోటీ చేసి ఉండి ఉంటే డిఎంకె తప్పకుండా ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఉండేది. అందుకే డిఎంకె నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరు చెపితేనే మండి పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండానే డిఎంకె ఇద్దరు రాజ్యసభ అభ్యర్ధుల పేర్లు ప్రకటించేసింది. డిఎంకె పార్టీ తరపున ఆర్.ఎస్.భారతి, టి.కె.ఎస్. ఇలంగోవన్ తమ అభ్యర్ధులుగా నిన్న ప్రకటించేసింది. డిఎంకె పార్టీకి మొత్తం 98మంది శాసనసభ్యులు ఉన్నందున వారిద్దరూ రాజ్యసభకు ఎంపిక అయినట్లే.
డిఎంకె సహకారంతో కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని రాజ్యసభకి పంపించుదామని ఆశపడింది. కానీ దానికి మాట మాత్రంగానైనా చెప్పకుండా డిఎంకె తమ ఇద్దరు అభ్యర్ధుల పేర్లను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కంగు తింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 8మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కనుక అది తనంతట తానుగా ఒక్క అభ్యర్ధిని కూడా రాజ్యసభకి పంపలేని పరిస్థితిలో ఉంది. అధికార అన్నాడిఎంకె పార్టీకి మొత్తం 132 మంది ఎమ్మెల్యేలున్నారు కనుక అది నలుగురు సభ్యులను రాజ్యసభకి పంపగలదు.