ఒక ప్రదేశంలో కొంత పరిధిలో యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. సాధారణంగా ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అగ్రదేశాలు ఈపద్దతిని ఉపయోగిస్తుంటాయి. మన రాజకీయ నాయకులు కూడా తమ ప్రత్యర్దులని ఉక్కిరిబిక్కిరి చేయడానికి అదే విధానం అమలుచేస్తున్నారు. ఈ విధానాన్ని మొట్టమొదట 2014 లోక్ సభ ఎన్నికలలో భాజపా అమలుచేసి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలుచేయడానికి సిద్ధం అవుతోంది.
మోడీ ప్రభుత్వానికి రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా, భాజపా దేశవ్యాప్తంగా 200 సభలు, ర్యాలీలు నిర్వహించి తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల గురించి, మిగిలిన మూడేళ్ళలో చేపట్టబోతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షహరాన్ పూర్ లో బహిరంగ సభతో ఈ ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, పార్టీ నేతలు దేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగే ఈ ప్రచార ర్యక్రమాలలో పాల్గొంటారు.
కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే సమయంలో కార్పెట్ బాంబింగ్ విధానంలో మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్దం అవుతోంది. అందుకోసం దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలు రెండు రోజుల వ్యవధిలో 50 మీడియా సమావేశాలు నిర్వహించి మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించి గణాంకాలతో సహా ప్రజలకు వివరించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్ వంటి హేమాహేమీలు అనేకమంది మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.
భాజపా ప్రచారం చేసుకోవడం వలన దానికి ఎంతో కొంత మైలేజి పెరుగవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ చేయబోయే విమర్శల వలన కంఠశోష తప్ప మరో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అవినీతికి మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీ, రెండేళ్ళలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేసుకుపోతున్న మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు. పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గొంతు చించుకొని మోడీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా మరో మూడేళ్ళవరకు లోక్ సభ ఎన్నికలు జరుగవు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ నాలిక దురద తీర్చుకోవడానికే విమర్శలు చేస్తే చేయాలి తప్ప దాని వలన మరే ప్రయోజనం ఉండబోదు.