గత రెండు మూడు వారాలుగా వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తలు మీడియాలో కనిపించడం లేదనుకొంటుంటే, మళ్ళీ ఇవ్వాళ్ళ ఓ ఎమ్మెల్యే పేరు వినిపించింది. ఆయన ఏరు అశోక్ రెడ్డి. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే. గురువారం ఆయన తన అనుచరులతో సమావేశం అయ్యి పార్టీ మారడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అనుచరులతో సమావేశం, అభిప్రాయ సేకరణ అంటే అది పార్టీ మారడానికి ముందు చేసే లాంచనమైన తంతు మాత్రమేనని అందరికీ తెలుసు కనుక బహుశః నేడో అశోక్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రకటన చేయవచ్చు. ఒకవేళ ఈ వార్తలు నిజం కాకపోయుంటే మీడియా ముందుకు వచ్చి కోన ఊపిరి వరకు జగనన్న వెంటే ఉంటాననే ఖండన ప్రకటన చేయవచ్చు. ఒకవేళ అశోక్ రెడ్డి తెదేపాలో చేరినట్లయితే, వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం తెదేపా తెర వెనుక ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనట్లే భావించవచ్చు. అలాగే ఒకవేళ అశోక్ రెడ్డి పార్టీ తెదేపాలో చేరినట్లయితే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టె విధంగా ఏదో ఒక వ్యూహంతో సమరానికి సిద్ధం కావచ్చు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇదివరకే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 9మంది ఎమ్మెల్యేలపై ఏవిధంగా అనర్హత వేటు వేసి బలపరీక్షలో పాల్గొనకుండా సుప్రీం కోర్టు అడ్డుకొందో, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలందరిని అనర్హులుగా ప్రకటించవలసిందిగా ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావుని ఆదేశించవలసిందిగా తన పిటిషన్ లో కోరారు. వారిపై సుప్రీం కోర్టు తప్పకుండా తగిన చర్యలు తీసుకొంటుందని వైకాపా ఆశిస్తోంది. కానీ స్పీకర్ పరిధిలో ఉండే ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోకపోవచ్చు కనుక ఒకవేళ అశోక్ రెడ్డి పార్టీ మారినా ఆయనకేమి ఇబ్బంది ఉండకపోవచ్చు.