గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఎదురుదెబ్బ తిన్న మజ్లీస్ పార్టీ వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధం అవుతోంది. మొత్తం 403 స్థానాలలోను తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం హైదరాబాద్ లో ప్రకటించారు. ఆ రాష్ట్రంలో అణచివేతకి గురవుతున్న దళితులను, ముస్లింలను కూడగట్టుకొని అధికార సమాజ్ వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాది పార్టీలను డ్డీకొంటామని తెలిపారు. అందుకోసం ఇప్పటికే బలమైన అభ్యర్ధులను గుర్తించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని, ఆ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు పార్టీ ప్రాధమిక సభ్యత్వం స్వీకరించారని, వచ్చే ఏడాదికి అది ఇంకా బారీగా పెరుగవచ్చని అన్నారు. గత ఏడాది బికాపూర్ ఉపఎన్నికలలో మజ్లీస్ పార్టీ కూడా పోటీ చేసినప్పుడు ‘జై భీమ్.. జై ఎం.ఐ.ఎం.’ అనే నినాదంతో ఆ రెండు వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎన్నికలలో గెలవలేకపోయినప్పటికీ ఓట్లు బాగానే పడటంతో ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేస్తే ఆ రాష్ట్రానికి కూడా తమ పార్టీని విస్తరించవచ్చని ఆశ పడుతున్నట్లుంది. అన్ని స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టి గట్టిగా కృషి చేస్తే విజయం సాధించలేకపోయినా వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చని ఆశ పడుతోంది.
అయితే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార సమాజ్ వాదీ పార్టీతో సహా అన్ని పార్టీలకు చాలా ముఖ్యమైనవే. పైగా అవన్నీ రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నాయి కనుక మజ్లీస్ పార్టీ ఎంత ప్రయత్నించినా అక్కడ కింగ్ మేకర్ కూడా కాలేదని చెప్పవచ్చు.
కానీ మజ్లీస్ పార్టీ ఆలోచనని, ప్రయత్నాలని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే తెదేపా, వైకాపాలు తమని తాము జాతీయ పార్టీలని ప్రకటించుకొన్నా కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ఆలోచించలేదు. కానీ హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్ పార్టీ లాంగ్ రేంజ్ మిస్సైల్ లాగ హైదరాబాద్ కి సుదూరంగా ఉన్న బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి సిద్దపడుతోంది. అందుకే ఆ రెండు పార్టీలతో పోలిస్తే మజ్లీస్ చాలా ధైర్యమైన పార్టీయేనని మెచ్చుకోక తప్పదు.