విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడిపై చేసిన వ్యాఖ్యలు నాకు మహానటులు ఎన్టీఆర్ ఏఎన్నార్‌ల డైలాగులను గుర్తుకు తెచ్చాయి. ఎన్టీఆర్ దేవుడి పాత్రలకు ప్రసిద్ధులు. ఆయనే దేవుడి దర్శనానికి రుసుం, తీర్థ ప్రసాదాలకూ రుసుం,చావు తప్పినా తప్పదు రుసుం అని స్వంత గొంతుతో పాటకు జోడిస్తారు కోడలు దిద్దిన కాపురంలో. అందులోనే నకిలీ బాబాల గుట్టు రట్టు చేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో భక్తుల పాత్రలు ధరించారు గాని నిజ జీవితంలో దైవారాధన చేయడం చూడలేదు. ప్రేమనగర్లో తాగుబోతు కథానాయకుడి సెక్రటరీగా వచ్చిన లత(వాణిశ్రీ) జమీందారీ బాధ్యతలకోసం ‘ మనం ఒకసారి దేవాలయానికి స్కూలుకు వెళ్లి చూడాలి అంటే -‘ నాకు స్కూలుకు వెళ్లవలసిన వయసా అయిపోయింది. దేవాలయానికి వెళ్లవలసినంత పాపం నేను చేయలేదు అంటాడు హీరో. ఆ సంగతి అలా వుంచితే పాపాలు పెరిగితే దేవుణ్ని దర్శించుకోవడం, ముడుపులు చెల్లించుకోవడం ఎక్కువవుతుందనేది ముఖ్యమంత్రి మనోగతం. ఆ వెంటనే లిక్కర్‌షాపుల ఆదాయం పెరక్కపోవడానికి అయ్యప్ప మాల వేసుకోవడం కారణంగా చెప్పారు. ఈ మాటల్లో పెద్ద తప్పేమీ లేదు. అన్నది కమ్యూనిస్టులు కాదు గనక సంఘ పరివార్‌కు సమస్యా లేదు. ఎక్కువ పాపాలు చేసే వారు ఎక్కువగా మొక్కుకుంటుంటారని చంద్రబాబు బహుశా రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని అన్నారు. అందుకే గుడికే కాదు, చర్చిలకు మసీదులకు కూడా పోతుంటారని జోడించారు. నవ్విద్దామని ఆయనఅన్న మాటలు మేమంతా పాపులమా అనుకునేలా భక్తులను గాయపరుస్తాయి గనక వివాదమైంది. తప్పులు చేసిన వారు ముడుపులు కట్టి బయిటపడేయమని కోరడం తెలిసిందే. గాలి జనార్థనరెడ్డి వజ్ర కిరీటం చేయించి దేవుడికే శఠగోపం పెట్టారని నేను సరదాగా అంటే ఆ విషయంలో తెలుగుదేశం నేతలు కూడా బలపర్చేవారు కాదు! .పాప పుణ్యాల మీమాంస ఎలా వున్నా చంద్రబాబు ఈ ధోరణిలో ఆదాయం పెంచడం గురించి మాట్లాడుతూ వుంటారు . ఏడాది కిందట ఎడిటర్లతో జరిగిన సమావేశం భోజన విరామంలో నేను ఈ మధ్య మీకు భక్తి విశ్వాసాలు పెరిగాయా అని అడిగితే మీరే చెప్పాలి అంటూ చాలాసేపే స్పందించారు. ఆ అంశాన్ని తనే కొనసాగిస్తూ ఏదో ఒక ఉపశమనం కోసం దైవచింతన యోగాసనాల వంటివి చేయాలని అన్నారు. తను మొదటి సారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దేవాలయాల ఆదాయం పెరగడానికి చాలా కృషి చేశానని, తిరుపతిలోనూ చాలా మార్పులు తెచ్చానని అన్నారు. శ్రీకాళహస్తి మరో ముఖ్యకేంద్రంగా మారడానికి తను తీసుకున్న చర్యలే దోహదం చేశాయని చెప్పారు. అక్కడ మత విశ్వాసాలకూ మార్కెట్‌కూ సంబంధం పూసగుచ్చారు. ఒక ఆలయం వుంటే దాని చుట్టూ నివాసాలు, దుకాణాలు, ఉపాధి, యాత్రీకులు ఇలా ఆర్థిక కార్యక్రమాలు పెరుగుతాయంటూ ఆర్థిక సిద్ధాంతం చెప్పారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయం ఆదాయం కూడా పలానా స్థాయికి చేరే అవకాశం వుందని అందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదంతా పిచ్చాపాటిగా జరిగినా ఆంధ్రజ్యోతి వివరంగానే ఇచ్చింది. ఈ మధ్య నూతన రాజధాని అమరావతిలో పదే పదే శంకుస్థాపనలూ పూజలూ ఆశీర్వచనాలూ వంటివి అందరూ చూస్తున్నవే.పుష్కరాలు వస్తే ముహూర్తాలుండవని హడావుడిగా ఉత్తుత్తి ప్రారంభోత్సవం కూడా జరిపేశారు.
ముఖ్యమంత్రి హౌదాలో మాట్లాడేప్పుడు అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవలసిందే. రెండవ రోజు సర్దుకోవడానికి ప్రయత్నించారు గాని తన వ్యాఖ్యలు తప్పుగా చిత్రించారని ఆరోపించడం అవసరంలేనిపని. .ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఇంగ్లీషు పత్రికలతో సహా అన్ని మీడియా సంస్థలూ నివేదించాయి.