తెదేపా తరపున ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. దాని కోసం ఆ పార్టీలో ఆంధ్రా నేతలే కాకుండా తెలంగాణా నేతలు కూడా ఆశపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఏపి కోటా నుంచి తెలంగాణా తెదేపా నేతలకి రాజ్యసభ సీటు ఇవ్వలేమని, ఎందుకంటే ఆంధ్రాలోనే చాలా మంది నేతలు దాని కోసం పోటీ పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రాలో కూడా ఆ మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి కేటాయిస్తామనే విషయం ఇప్పుడే చెప్పలేమని దానిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని నారా లోకేష్ చెప్పారు. ‘కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి మళ్ళీ సీటు కేటాయిస్తారా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు, ‘భాజపా నుంచి ఇంతవరకు మాకు అటువంటి అభ్యర్ధన ఏమీ రాలేదు. వస్తే పరిశీలిస్తామని’ జవాబు చెప్పారు.
తెలంగాణాలో తెదేపా పరిస్థతి రాన్రాను మరీ దయనీయంగా మారుతుండటంతో, అక్కడి సీనియర్ నేతలు కనీసం ఒక రాజ్యసభ సీటునైనా తమకి ఇవ్వాలని కోరుతున్నారు. చాలా కాలంగా గవర్నర్ పదవిపై ఆశ పెట్టుకొన్న మోత్కుపల్లి నరసింహులు వారిలో ఒకరు. కానీ తెలంగాణా తెదేపా నేతలకి రాజ్యసభ సీటు ఇవ్వడం సాధ్యం కాదని నారా లోకేష్ చెప్పడంతో వారు నిరాశ చెంది ఉండవచ్చు. తెలంగాణాలో తెదేపా కోసం చాలా కష్టపడి పని చేసి, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలని కాదని, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెపుతున్న భాజపా కోరితే సీటు ఇస్తామన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. భాజపాకి సీటు కేటాయించగలిగినప్పుడు, పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఎందుకు కేటాయించడం లేదని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భాజపాకి సీటు కేటాయించినా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అధనంగా వరాలేవీ కురిపించేయదు. పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి రాష్ట్ర భాజపా నేతలు తెదేపాపై విమర్శలు చేయకుండా ఉండరు. కనుక భాజపాని నెత్తిన ఎక్కించుకొని మోస్తూ బాధ పడటం కంటే, తెలంగాణాలో తెదేపా నేతలలో ఒకరికి ఆ సీటు కేటాయిస్తే వారు కూడా పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తారు కదా?