పోరుగురాష్ట్రాన్ని కవ్వించేలా, ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టేలా రాజకీయ తీర్మానాలు ఆమోదించవలసిన అరుదైన విచిత్ర పరిస్ధితి తెలుగుదేశం మహానాడు ముందువుంది.ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ప్రజలకు ఈ తీర్మానాలు నచ్చవు. అంతేకాకుండా వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా వుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్ధులను స్వాధీనం చేసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహానాడులో తీర్మానం చేయబోతున్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ మరో తీర్మానం ఆమోదించనున్నారు.
తెలుగుదేశం పాలనలో ప్రజాప్రయోజనాలు ఎలాదెబ్బతింటున్నాయో వివరించి మద్దతుకూడగట్టుకోవలసిన ప్రతిపక్షనాయకుడు జగన్ ఆ విషయం పక్కన పడేసి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దాడికి దిగిపోతున్నారు. శాసనసభ అయినా, ప్రజల మధ్య సభ అయినా, మీడియా సమావేశమైనా జగన్ ఎన్నికల సభ అన్నట్టుగా చంద్రబాబుని దుమ్మెత్తిపోయడానికే పరిమిత మౌతున్నారు. తన వస్తువను తెలుగుదేశం లాగేసుకున్నదన్నంత అక్కసు, ఆక్రోశం జగన్ లో ఎల్లవేళలా కనబడుతూనే వుంటాయి. ఈయన వ్యూహం, ఎత్తుగడా మార్చకపోతే పార్టీ పటిష్టం కావడం కష్టం అని తటస్ధులు కూడా భావిస్తున్నారు.
చావుతప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచిన తెలుగుదేశం పార్టీకి జగన్ పార్టీ ఎప్పటికీ అదురుపాటుగానే వుంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో బాబునీ, తెలుగుదేశాన్నీ ఎంత హేళన చేసేవారో ఇపుడు తెలుగుదేశం జగన్ ను అంతగానూ హేళన చేస్తూనే వుంది. దీంతో మరింత జగన్ మరింత రెచ్చిపోతున్నారు. అందుకు ప్రతిగా జగన్ అక్రమ ఆస్ధుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సందర్భంలో హెచ్చరించారు.
అవినీతి, అక్రమ ఆస్ధుల కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంటు డైరక్టరేట్ జప్తు చేసిన ఆస్ధులను ప్రభుత్వం స్వాధీనం చేసుకనేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్రకూడా పడింది. చంద్రబాబు హెచ్చరికకు నేపధ్యం ఇదే! అవసరమైతే, పరిస్ధితి శృతిమించితే హెచ్చరికను అమలు చేయడానికి పార్టీ నుంచి ముఖ్యమంత్రి ముందుగానే ఆమోదం పొందే పొలిటికల్ ప్రాసెస్సే ఈ తీర్మానం! నేరస్ధుణ్ణి కోర్టు శిక్షిస్తే ప్రజలు సరిపెట్టుకుంటారు. అందుకు రాజకీయ అధికారాన్ని ప్రయోగిస్తే దాన్ని కక్షసాధింపుగానే భావిస్తారు. అదీగాక జగన్ కు ప్రజల్లో వున్న మద్దతు తక్కువేమీ కాదు.
అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, కుటుంబ వారసత్వం, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం మొదలైన విషయాల ప్రస్తావనతో టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ మరికొన్ని తీర్మానాలు చేయబోతున్నారు.
ఓటుకునోటు కేసులో స్వయంగా చంద్రబాబు వాయిస్ దొరికిపోవడాన్ని కెసిఆర్ మెరపువేగంతో తనకు సానుకూలంగా వాడేసుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం చిత్తయిపోయింది. ఓటుక నోటుకేసులో వున్న ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప తెలుగుదేశానికి ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలని నేపధ్యంలో టిఆర్ఎస్ మీద విరుచుకపడటం అంటే తెలంగాణాలో పార్టీశ్రేణుల్లో హుషారు నింపడమే తప్ప మరేమీ కాదు. ఈ తీర్మానాలు కూడా మహానాడు జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆసక్తి కలిగించవు…అంతేకాకుండా ”హైదరాబాద్ లో మనవాళ్ళని బాగానే చూసుకుంటున్నారు కదా. ఇలాంటప్పుడు వాళ్ళని కెలకడం అవసరమా” అనే విమర్శలను కూడా తెలుగుదేశం మోయవలసి వుంటుంది.
తెలుగుదేశం డ్రాఫ్టు కమిటీ ఇప్పటికే సిద్ధం చేసిన ఈ తీర్మానాలను పాలిట్ బ్యూరో పరిశీలించి మార్పులు చేర్పులు సవరణలు చేస్తుంది. తీర్మానాలు సరే! వాటిపై ఎంత చర్చజరుగుతుంది? దాన్ని ఎలా ముగిస్తారు అన్నదాన్నిబట్టే ఈ విషయాల్లో పార్టీ మూడ్, అండ్ ధాట్ స్పష్టమౌతుంది.