ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల భర్తీలో ఆంధ్రాలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంటే, తెలంగాణాలో మాత్రం పూర్తి స్పష్టత ఏర్పడింది. తెరాస తరపున డి.శ్రీనివాస్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంత రావులను రాజ్యసభ అభ్యర్ధులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించారు. కనుక ఇంక తెలంగాణాలో రాజ్యసభ సీట్ల భర్తీ విషయంలో ఊహాగానాలు ముగిసినట్లే. ఆంధ్రాలో వైకాపా తరపున ఊహించినట్లుగానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డిని అభ్యర్ధిగా జగన్ ప్రకటించడంతో ఆయన నామినేషన్ కూడా వేశారు.
తెదేపా తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. నిర్మలా సీతారామన్ కి మళ్ళీ సీటు కేటాయించమని భాజపా నుంచి అభ్యర్ధన వస్తే పరిశీలిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ భాజపా పట్టించుకోకపోవడం విశేషమే. భాజపా నుంచి అభ్యర్ధన వస్తుందేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా వేచి చూస్తున్నారేమో? కానీ భాజపా తీరు చూస్తే చంద్రబాబు ముందు చెయ్యి జాచేందుకు సిద్దంగా ఉన్నట్లు లేదు. ఈ నెలాఖరు వరకు ఇంకా గడువు ఉంది కనుక మరొకటి రెండు రోజులు చూసి తెదేపా అభ్యర్ధుల పేర్లను ముఖ్యమంత్రి ప్రకటిస్తారేమో?