రెండేళ్ల పండుగ సంబరాల్లో మునిగితేలిన మోడీ బృందానికి ఇది తీపికబురు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే గతంలోకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందట. కాంగ్రెస్ కూడా సీట్లను పెంచుకుంటుందని, వామపక్షాలు మొక్కుబడిగా నాలుగు సీట్లు పెరిగినా నామమాత్రపు పాత్రకే పరిమితం అవుతాయని సర్వే అంచనా వేసింది.
ఎ.బి.పి. న్యూస్ చానల్, ఐ.ఎం.ఆర్.బి. సర్వే ప్రకారం, తక్షణం ఎన్నికలు జరిగితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే 342 సీట్లు గెల్చుకుంటుందని అంచనా. 2014లో గెలిచిన 339 సీట్లకంటే 3 అదనం అన్నమాట. ఈసారి ఉత్తరాన సీట్లు తగ్గుతాయని, దక్షిణాదిన పెరుగుతాయని అంచనా.
ఇక యూపీఏ స్వల్పంగా సీట్లు పెంచుకుంటుందట. కాంగ్రెస్ నాయకత్వంలోని ఎన్డీయే 2014లో 62 సీట్లు గెల్చుకుంది. ఈసారి ఆ సంఖ్య 66కు పెరుగుతుందట. వామపక్షాలు 2014లో పట్టుమని 10 సీట్లకు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తే 14 సీట్లు గెలిచే అవకాశం ఉందట.
రెండేళ్లలో ప్రధాని మోడీ పనితీరు బాగుంది లేదా చాలా బాగుందని 49 శాతం మంది చెప్పారట. అదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వ పనితీరు బాగుంది లేదా చాలా బాగుందని చెప్పిన వారు 36 శాతం కావడం గమనార్హం. అయితే మోడీ రెండేళ్ల పాలనలో మంచిరోజులు వచ్చాయా అంటే లేదని ఎక్కువ మంది స్పందించారట.
మోడీ పాలన అధ్వాన్నంగా ఉందంటూ కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఊరూరా సభలు పెట్టి ఊదరగొట్టడానికి ప్లాన్ చేసింది. లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్, అవినీతి ఆరోపణలు లేని మోడీ పాలనపై విమర్శలు చేయడం ప్రజలను అంతగా మెప్పిస్తుందా అనేది ప్రశ్న.
తమ పాలన బాగుందని బీజేపీ నేతలు చెప్తున్న మాటలు నిజమే అనే విధంగా సర్వే అంచనాలు వెల్లడయ్యాయి. విజయ్ పర్వ్ పేరుతో 198 నగరాల్లో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న బీజేపీ నేతలకు, ఈ అంచనాలు ఫుల్ జోష్ ఇవ్వడం ఖాయం.